గగన్‌కు నిరాశ

28 Oct, 2014 00:50 IST|Sakshi
గగన్‌కు నిరాశ

వరల్డ్‌కప్ షూటింగ్ ఫైనల్స్

 గబాలా (అజర్‌బైజాన్): వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో భారత షూటర్ గగన్ నారంగ్ నిరాశపరిచాడు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో గగన్ 144.7 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. డానియల్ బ్రాడ్‌మియర్ (జర్మనీ-210.5 పాయింట్లు) స్వర్ణం సాధించగా... షెంగ్‌బో జావో (చైనా-208.5 పాయింట్లు), హెన్రీ జుంగనెల్ (జర్మనీ-187.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు.

ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న జీతూ రాయ్ ఫైనల్స్‌లో మాత్రం తడబడ్డాడు. అతను 150.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. జీవీ వాంగ్ (చైనా-195.8 పాయింట్లు), తొమొయుకి మత్సుదా (జపాన్-194.8 పాయింట్లు), పాంగ్ వీ (చైనా-170.1 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు. సీజన్‌లో నాలుగు వరల్డ్ కప్‌లలో రాణించి టాప్-8లో ఉన్న వారు ఈ ఫైనల్స్‌లో పాల్గొన్నారు. ఓవరాల్‌గా భారత్‌కు ఈ మెగా ఈవెంట్‌లో ఒక్క పతకమూ రాలేదు.

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అయోనిక పాల్ నాలుగో స్థానం పొందగా... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో హీనా సిద్ధూ క్వాలిఫయింగ్ దశలోనే నిష్ర్కమించింది. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ సింగ్ సంధూ కాంస్య పతకాన్ని కోల్పోగా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

మరిన్ని వార్తలు