హమ్మయ్య...డబ్బులొచ్చాయి!

23 May, 2014 00:57 IST|Sakshi

క్రీడా సంఘాలకు ఊరట
 రూ. 74.75 లక్షలు విడుదల
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ క్రీడా సంఘాలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. గతంలో టోర్నీలు, శిక్షణా శిబిరాల నిర్వహణ కోసం ఖర్చు చేసిన దాదాపు రూ. 75 లక్షల రూపాయలు విడుదల చేసింది. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2009-2012 మధ్య కాలంలో రాష్ట్రంలో వేర్వేరు క్రీడా సంఘాలు టోర్నీలు, కోచింగ్ క్యాంప్‌లు నిర్వహించాయి. నిబంధనల ప్రకారం వీటి కోసం ‘శాప్’ ఆయా సంఘాలకు డబ్బులు చెల్లించాల్సి ఉంది.
 
 అయితే తమ వద్ద నిధులు లేవంటూ ‘శాప్’ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టింది. దీనిపై ఏపీ ఒలింపిక్ సంఘం ప్రతినిధులు గత ముఖ్యమంత్రికి అనేక సార్లు విజ్ఞప్తులు చేశారు. ఈ నెల 1న ఏపీఓఏ సభ్యులు గవర్నర్‌ను కూడా కలిశారు. ఈ పరిణామాల అనంతరం తాజాగా ఏపీఓఏకు రూ. 74.75 లక్షలు ఇచ్చేందుకు ‘శాప్’ మేనేజింగ్ డెరైక్టర్‌కు అనుమతి లభించింది.
 
 తాజా ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నుంచి ఈ మొత్తం ఇచ్చేందుకు ఆర్ధిక శాఖ అంగీకరించింది. ఈ నెల 25 తర్వాత సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఆర్ధిక పరమైన ఉత్తర్వులకు అవకాశం లేదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాస్త ముందుగా నిధులు విడుదల కావడం పట్ల ఏపీఓఏ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు