జొకోవిచ్‌.. వ్యాక్సిన్‌ తీసుకోనంటే కుదరదు: నాదల్‌

9 May, 2020 13:04 IST|Sakshi
రఫెల్‌ నాదల్‌-జొకోవిచ్‌(ఫైల్‌ఫొటో)

రూల్స్‌కు ఎవరూ అతీతం కాదు

ఏ ఒక్కరి కోసమో  నిబంధనలను మార్చరు

మాడ్రిడ్‌: కరోనా వ్యాక్సిన్‌ను ప్రతీ ఒక్కరికీ కచ్చితత్వం చేయాల్సిన అవసరం లేదంటూ  ఇటీవల సెర్బియా టెన్నిస్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాను కరోనా వ్యాక్సిన్‌కు వ్యతిరేకమంటూ ముందుగానే తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఒకవేళ వ్యాక్సిన్‌ తీసుకుంటే అది ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇది వారి వారి వ్యక్తిగత ఇష్టానికి వదిలిపెట్టాలన్నాడు. తాను మాత్రం ఈ టీకాను తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అయితే ఇది కుదరని పని అంటున్నాడు సహచర టెన్నిస్‌ ఆటగాడు, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌. ప్రతీ ఒక్కరూ రూల్స్‌ను పాటించాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘ జొకోవిచ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనంటే కుదరదు. అతను టెన్నిస్‌ ఆటలో టాప్‌లో కొనసాగాలంటే వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే. ఇక్కడ నియమ నిబంధనలకు ఎవరూ  అతీతం కాదు. (కరోనా టీకాకు నేను వ్యతిరేకం: జొకోవిచ్‌)

ఏ ఒక్కరి కోసమో నిబంధనలను మార్చే అవకాశం ఉండదు. ప్రధానంగా మనం వరల్డ్‌ టూర్‌లకు వెళ్లినప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోమనే నిబంధన అమలు చేస్తారు. అప్పుడు నాకు వద్దంటే అది వీలుకాదు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత దాన్ని తీసుకోవడం, తీసుకోకపోవడం వారి వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది. ఆటగాళ్ల విషయంలో అది సాధ్యపడదు. టెన్నిస్‌ పర్యటనలకు వెళ్లినప్పుడు వ్యాక్సిన్‌ తప్పనిసరి చేస్తే అప్పుడు ఎలా కాదంటాం. అది నాకైనా, జొకోవిచ్‌కైనా వర్తిస్తుంది. డోపింగ్‌కు దూరంగా ఉండాలను క్రమంలో కొన్ని నిబంధనలకు పాటించే వారికి కూడా ఇది తప్పనిసరే అవుతుంది. ఒకసారి రూల్‌ను తెచ్చిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పలేం’ అని నాదల్‌ పేర్కొన్నాడు.

ఇప్పటివరకూ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ రాకపోయినా, దీనికి ట్రయల్స్‌  జరుగుతున్నాయి కాబట్టి అది సాధ్యమైనంత తొందరగానే వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను జొకోవిచ్‌ వ్యతిరేకించాడు. ఇక్కడ ఎవరి ఇష్టాలు ఎలా ఉన్నా, అది తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదన్నాడు. తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కరోనా టీకాను తీసుకోనని స్పష్టం చేశాడు.  ప్రతీ టెన్నిస్‌ ప్లేయర్‌ కరోనా టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలన్న మహిళా టెన్నిస్‌ మాజీ నంబర్‌ వన్‌ ఎమెలీ మౌరెస్మో సూచనను జొకోవిచ్‌ వ్యతిరేకించాడు. అదే విషయంపై ఇప్పుడు నాదల్‌ మాట్లాడుతూ.. అది సాధ్యపడని అంశంగా పేర్కొన్నాడు. జొకోవిచ్‌ టెన్నిస్‌లో కొనసాగాలంటే వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని ప్రపంచ రెండో ర్యాంక్‌ ఆటగాడు నాదల్‌ పేర్కొన్నాడు.(మన ముగ్గురం కలిసి...)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు