జొకో ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్..

1 Aug, 2016 18:54 IST|Sakshi
జొకో ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్..

టొరొంటో: ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్ చేరింది. రోజర్స్ కప్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6-3,7-5 తేడాతో జపాన్ యువతార కీ నిషికోరిపై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.  తద్వారా 30వ ఏటీపీ మాస్టర్స్ టైటిల్స్ను తన ఖాతాలో వేసుకున్న జొకోవిచ్.. తన అత్యధిక మాస్టర్స్ టైటిల్స్ రికార్డును మరోసారి సవరించుకున్నాడు. మరోవైపు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్(28 మాస్టర్స్ టైటిల్స్), స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్(24 మాస్టర్స్ టైటిల్స్)లను మరింత వెనక్కి నెట్టాడు.

రోజర్స్ కప్ టైటిల్ పోరులో తొలి సెట్ను 32 నిమిషాల్లో అవలీలగా గెలుచుకున్న జొకోవిచ్.. రెండో సెట్లో మాత్రం నిషికోరి నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. రెండో సెట్ టై బ్రేక్కు దారి తీసే తరుణంలో రెండు బ్రేక్ పాయింట్లతో ఆ సెట్ను కైవసం చేసుకున్న జొకోవిచ్ టైటిల్ను కూడా గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడంపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు జొకోవిచ్ తెలిపాడు.

>
మరిన్ని వార్తలు