మాడ్రిడ్‌ మాస్టర్‌ జకోవిచ్‌

13 May, 2019 21:35 IST|Sakshi

ఫైనల్లో సిట్సిపాస్‌పై ఘనవిజయం

మాడ్రిడ్‌: ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ చేరింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ముగిసిన మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌–1000 సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తుదిపోరులో జకో 6–3, 6–4తో గ్రీస్‌ యువ సంచలనం స్టెఫానో సిట్సిపాస్‌పై గెలు పొందాడు. గంటా 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌ల్లో సిట్సిపాస్‌ నుంచి జకోవిచ్‌కు పెద్ద ప్రతిఘటన ఎదురుకాలేదు. దీంతో తొలి సెట్‌ ఆరంభమైన 12 నిమిషాల్లోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లిన జకోవిచ్‌ ఆ తర్వాత మరో మూడు పాయింట్లు సాధించి 6–3తో 40 నిమిషాల్లోనే సెట్‌ను ముగించాడు.
రెండో సెట్లో సిట్సిపాస్‌ పుంజుకోవడంతో హోరాహోరీ సాగింది. ఒక దశలో 4–4తో సమంగా నిలిచినప్పటికీ జకోవిచ్‌ మరోసారి విజృంభించి సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. జకోవిచ్‌ రెండు ఏస్‌లు సంధించి, రెండు బ్రేక్‌ పాయింట్లు గెలుచు కోగా, సిట్స్‌పాస్‌ ఒక ఏస్‌ మాత్రమే కొట్టి, ఒక అనవసర తప్పిదం చేశాడు. జకోవిచ్‌ ఖాతాలో ఇది 33వ ఏటీపీ మాస్టర్స్‌–1000 టైటిల్‌. మొత్తమ్మీద అతని ఖాతాలో 74 టైటిళ్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు