విరాట్‌ కోహ్లికి సరికొత్త తలపోటు

6 Jul, 2020 11:40 IST|Sakshi

కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ సెగ

రుజువైతే కోహ్లిపై చర్యలు

న్యూఢిల్లీ:: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) అంశం సరికొత్త తలపోటుగా మారింది.  కోహ్లి ఒకేసారి రెండు వ్యాపార సంస్థల్లో  కీలక స్థానాల్లో ఉన్నాడంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశాడు. దీనిపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఎథిక్స్‌ అధికారి, అంబుడ్స్‌మన్‌ జస్టిన్‌ డీకే జైన్‌కు ఫిర్యాదు చేశాడు. ‘ బీసీసీఐలోని 38(4) నిబంధనను కోహ్లి అతిక్రమించాడు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం. ఒక సమయంలో ఒక పోస్ట్‌లో ఉండాలనేది నిబంధనల్లో భాగం. దీన్ని కోహ్లి ఉల్లంఘించాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. (హార్దిక్‌-కృనాల్‌ల ‘తొలి’ ఇంటర్వ్యూ చూశారా?)

దీనిపై డీకే జైన్‌ మాట్లాడుతూ.. ఒకేసారి రెండు పదవులు అనుభవిస్తూ బీసీసీఐ నిబంధనను కోహ్లి అతిక్రమించినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించిన తర్వాత విరాట్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కల్గి ఉంటే నోటీసులిస్తామని అన్నారు. లోధా కమిటీ సంస్కరణల్లో భాగంగా ప్రస్తుత ఆటగాళ్లు, సెలెక్టర్లు, కామెంటేటర్లు, ఆఫీస్‌ బేరర్లు, మ్యాచ్‌ అధికారులు ఏకకాలంలో రెండు పదవుల్లో కొనసాగడానికి వీల్లేకుండా గతంలోనే బీసీసీఐ రాజ్యాంగ సవరణ చేసింది.  కాగా,  కోహ్లి  స్పోర్ట్స్‌, కార్నర్‌స్టోన్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌లలో కో-డైరెక్టర్‌గా ఉండడంతో పాటు కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిడెడ్‌లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడని గుప్తా ఫిర్యాదు చేశాడు. ఇది కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ అంటూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. అయితే మరి కోహ్లి నిజంగానే రెండింటిలోనూ కీలక పదవుల్లో ఉన్నాడా.. లేదా అనే అంశాన్ని డీకే జైన్‌ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. ఒకవేళ ఇది రుజువైతే కోహ్లిపై చర్యలు తప్పవు. (‘ఐపీఎల్‌తో పెద్దగా ఒరిగిందేమీ లేదు’)

మరిన్ని వార్తలు