ఆ క్రికెటర్‌ను వరల్డ్‌కప్‌కు పంపించొద్దు..

24 Dec, 2019 13:01 IST|Sakshi

కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌ జాతీయ క్రికెట్‌ తరఫున అరంగేట్రం చేసిన నసీమ్‌ షాను అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టులో సైతం ఎంపిక చేస్తూ ఆ దేశ  జూనియర్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే అండర్‌-19 వరల్డ్‌కప్‌కు నసీమ్‌ను పంపించవద్దని అంటున్నాడు మరో క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌. పాక్‌ జాతీయ  జట్టు  తరఫున అరంగేట్రం చేసిన నసీమ్‌  మానసింకంగా, ధృఢంగా మారాలంటే మరింత సాధన అవసరమని, దాంతో జూనియర్‌ స్థాయిలో మ్యాచ్‌లకు ఎంపిక చేయొద్దని పీసీబీకి సూచించాడు.

‘ పీసీబీకి, మా జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఇది నేను మర్యాద పూర్వకంగా విన్నవిస్తున్నా. అండర్‌-19 వరల్డ్‌కప్‌కు నసీమ్‌ను పంపవద్దు. అతను ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆడేశాడు. ఆ స్థాయిలో టెక్నికల్‌గా, శారీరకంగా మరింత పరిణితి సాధించాలంటే ఎక్కువ శ్రమించాలి. నసీమ్‌ స్థానంలో మరొకర్ని ఎంపిక చేయండి. మిగతా పేస్‌ బౌలర్‌ ఎవరైనా ఉంటే అతనికి అవకాశం ఇవ్వండి’ అని హఫీజ్‌ కోరాడు.

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌  ఆడిన పాకిస్తాన్‌.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ప్రధానంగా పాకిస్తాన్‌ టీనేజ్‌ క్రికెటర్‌ నసీమ్‌ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి శ్రీలంక  పతనాన్ని శాసించాడు.  తద్వారా ఒక టెస్టు మ్యాచ్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. ప్రస్తుతం పీసీబీ లెక్కల ప్రకారం నసీమ్‌ షా 16 ఏళ్ల 307 రోజుల వయసు కల్గి ఉన్నాడు.

మరిన్ని వార్తలు