‘కోహ్లి ఆడినా, ఆడకున్నా ఒక్కటే’

1 Nov, 2019 12:22 IST|Sakshi

ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్‌  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇవ్వగా, రోహిత్‌ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో కోహ్లితో పాటు మరికొంతమంది సీనియర్లకు రెస్ట్‌ ఇచ్చారు. అయితే కోహ్లి ఆడినా, ఆడకున్నా ఒక్కటే అంటున్నాడు బంగ్లాదేశ్‌ ఆటగాడు లిటాన్‌ దాస్‌. గురువారం తొలి ప్రాక్టీస్‌ సెషనల్‌ అనంతరం లిటాన్‌ దాస్‌ మాట్లాడుతూ.. ‘ భారత జట్టులో కోహ్లి ఉన్నాడా, లేడా అనేది తమకు సమస్యే కాదని పేర్కొన్నాడు.  ‘ అతను విశ్రాంతి తీసుకోవాలనుకుంటే  అందుకు తగిన రీజన్‌ ఉంటుంది. దాన్ని మేము సీరియస్‌గా తీసుకోవడం లేదు.

కోహ్లి లేనంత మాత్రాన భారత జట్టు బలహీనంగా ఉందని నేను అనుకోవడం లేదు.  ఆ జట్టులో చాలామంది మంచి ఆటగాళ్లు ఉన్నారు కదా. అందులో ప్రతీ ఆటగాడికి ప్రతిభ ఉంది కదా. మరి అటువంటప్పుడు కోహ్లి గైర్హాజరీ ఎలా ప్రభావం చూపుతుంది’ అని లిటాన్‌ దాస్‌ అన్నాడు. ఇక తమ జట్టుకు వస్తే బాగా అనుభవం ఉన్న ఆటగాళ్లు భారత పర్యటనకు దూరమయ్యారన్నాడు. అయినప్పటికీ తమ ఉన్న జట్టుతోనే సాధ్యమైనంతవరకూ మంచి ప్రదర్శన ఇస్తామన్నాడు. భారత్‌-బంగ్లాదేశ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో ఇరు  జట్లు మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్నాయి. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో సిరీస్‌ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు