టీమిండియాదే సిరీస్‌

14 Oct, 2018 17:24 IST|Sakshi

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కైవశం చేసుకుంది. రెండో టెస్టులో భారత్‌ 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. విండీస్‌ నిర్దేశించిన 72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌( 33 నాటౌట్‌), పృథ్వీ షా(33 నాటౌట్‌)లు వికెట్‌ పడకుండా ఆడి టీమిండియాకు ఘన విజయాన్ని అందించారు. రెండో టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన విరాట్‌ గ్యాంగ్‌ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 127 పరుగులకే కుప్పకూలింది. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ను టీమిండియా బెంబేలెత్తించింది. ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, కీరన్‌ పావెల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించిన భారత్‌.. ఆపై అదే దూకుడుతో విండీస్‌కు చుక్కలు చూపించింది. సునీల్‌ అంబ‍్రిస్‌(38;95 బంతుల్లో 4 ఫోర్లు), షాయ్‌ హోప్‌(28; 42 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించగా, మిగతా వారు చేతులెత్తేశారు. ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. 

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తాచాటిన ఉమేశ్‌ యాదవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం చెలరేగి బౌలింగ్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను సాధించాడు. దాంతో మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకుని తన టెస్టు కెరీర్‌లో తొలిసారి ఆ ఘనతను లిఖించుకున్నాడు. అతనికి జతగా రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ రెండు  వికెట్లు తీశాడు. కుల్డీప్‌కు వికెట్‌ దక్కింది. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 311 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 127 ఆలౌట్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 367 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 72/0

విండీస్‌ను కూల్చేశారు..

మరిన్ని వార్తలు