వాటి కోసం ఎప్పుడూ ఆలోచించను: రోహిత్‌

30 Oct, 2018 12:54 IST|Sakshi

ముంబై:తాను క్రీజ్‌లోకి వెళ్లేటప్పుడు సెంచరీలు గురించి కానీ డబుల్‌ సెంచరీలు గురించి కానీ ఆలోచించనని, కేవలం సాధ్యమైనంత సేపు క్రీజ్‌లో ఉండాలనే ఆలోచనతోనే బ్యాటింగ్ చేస్తానని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో రోహిత్‌ శర్మ 162 పరుగుల సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వన్డే ఫార్మాట్‌లో అత్యధికసార్లు 150కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ తన రికార్డును మరింత సవరించుకున్నాడు. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సచిన్‌ టెండూల్కర్‌ ఐదుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన రికార్డును బ్రేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

విండీస్‌తో నాల్గో వన్డే తర్వాత మాట్లాడుతూ.. ‘సెంచరీలు,డబుల్‌ సెంచరీలు గురించి నేను ఎప‍్పుడూ ఆలోచించిన దాఖలు లేవు. జట్టుకు ఉపయోగపడే విధంగా బ్యాటింగ్‌ చేసేందుకు మాత్రమే క్రీజ్‌లోకి వెళతా. నేను మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన  క్రమంలో కూడా వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ మ్యాచ్‌లో కూడా రాయుడు నా వద్దకు వచ్చి డబుల్‌ సెంచరీ సాధిస్తానని చెప్పాడు. కానీ నా ఫోకస్‌ అంతా బ్యాటింగ్‌పైనే  ఉంచా. అంతేతప్ప ద్విశతకం గురించి ఆలోచించలేదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మైదానంలో అంతర్జాతీయ వన్డే జరుతుండటంతో.. భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఒక మెరుగైన భాగస్వామ్యం రాయుడితో నాకు లభించింది’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

ఇక్కడ చదవండి:  రోహిత్‌ ధమాకా.. రాయుడు పటాకా

మరిన్ని వార్తలు