‘ఇక ఐపీఎల్‌పై ఆశలు వదులుకోవచ్చు’

7 May, 2020 16:47 IST|Sakshi

ప్రతీ టోర్నీని రీషెడ్యూల్‌ చేయాల్సిందే..

లాక్‌డౌన్‌ ముగిసే వరకూ నిరీక్షించక తప్పదు: షమీ

న్యూఢిల్లీ: ఈ సీజన్‌  ఐపీఎల్‌పై ఇక ఆశలు వదులుకోవచ్చని అంటున్నాడు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే ఐపీఎల్‌ జరగడానికి అవకాశాలేమీ కనిపించడం లేదన్నాడు. స్పోర్ట్స్‌ తక్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఐపీఎల్‌ గురించి షమీ పలు విషయాలను వెల్లడించాడు. నేను ఐపీఎల్‌ సాధ్యాసాధ్యలపై ఇర్ఫాన్‌ భాయ్‌తో మాట్లాడుతూనే ఉన్నా. ఈ సీజన్‌ ఐపీఎల్‌  నిర్వహించడానికి సమయం అనేది ఉండకపోవచ్చు. ఇక్కడ టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌  కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతీది ఆగిపోయింది. ప్రతీ టోర్నీని రీషెడ్యూల్‌ చేయడమే కనిపిస్తుంది. దాంతో ఈ ఏడాది ఐపీఎల్‌ జరగదనేది నా అభిప్రాయం. ఏం జరుగనుందో  చూడటం  మాత్రమే మనం చేయాల్సింది’ అని షమీ పేర్కొన్నాడు. ఒకవేళ లాక్‌డౌన్‌ తొందరగా ముగిసిపోతే అప్పుడు ఐపీఎల్‌  గురించి ఏమైనా ఆలోచించవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. (వార్నర్‌ జట్టులో 8 మంది భారత క్రికెటర్లే..)

అయితే  లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదని, అప్పటి వరకూ నిరీక్షణ తప్పదన్నాడు. ఈ ఏడాది చివర్లో ఐపీఎల్‌ జరిగే కంటే, టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగితేనే బాగుంటుందన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ఐపీఎల్‌ ఒక సన్నాహకంగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. పరిస్థితులు  చక్కబడి క్రికెట్‌ ఆరంభమైన తర్వాత క్రికెటర్లు తమ పూర్వపు ఫామ్‌ను అందుకోవడానికి కనీసం నెల  సమయం పడుతుందన్నాడు. క్రీడా స్టార్స్‌లో దాదాపు 95  శాతం మంది ఎటువంటి యాక్టివిటీస్‌  లేకుండా ఇంటిలోనే ఉండిపోయారన్నాడు. దాంతో ఆయా ఆటగాళ్లు గాడిలో పడటానికి సమయం పడుతుందన్నాడు.  ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మార్చి29వ తేదీన ఐపీఎల్‌-13వ  సీజన్‌ ఆరంభం కావాల్సి ఉంది. అయితే  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తొలుత ఏప్రిల్‌  14వ తేదీ వరకూ ఐపీఎల్‌ షెడ్యూల్‌ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడింది. దాంతో ఈ లీగ్‌ ఇక జరగడం దాదాపు అసాధ్యంగానే మారింది.(‘భారత్‌తో డబ్యూటీసీ వద్దు.. యాషెస్‌ పెట్టండి’)

మరిన్ని వార్తలు