డైమండ్ లీగ్ మీట్‌లో బోల్ట్‌కు రెండు స్వర్ణాలు

28 Jul, 2013 11:19 IST|Sakshi
డైమండ్ లీగ్ మీట్‌లో బోల్ట్‌కు రెండు స్వర్ణాలు

లండన్: ఒలింపిక్ చాంపియన్, జమైకన్ స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ స్ప్రింట్‌లో తానే రారాజునని మరోసారి నిరూపించాడు. లండన్ డైమండ్ లీగ్ ఈవెంట్‌లో 100 మీటర్ల పరుగులో చాంపియన్‌గా నిలిచాడు. అంతేకాదు సీజన్‌లో మెరుగైన టైమింగ్‌ను నమోదు చేశాడు. తద్వారా వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన ప్రత్యర్థులకు సవాలు విసిరాడు.
 
 గతేడాది ఒలింపిక్స్ పోటీలు జరిగిన క్విన్ ఎలిజబెత్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 100 మీటర్ల పరుగు నిర్వహించారు. ప్రపంచంలోనే వేగవంతమైన రన్నర్ బరిలోకి దిగడంతో ప్రేక్షకులు పోటెత్తారు. 65 వేల మంది ప్రేక్షకులు ఉత్సాహపరిచిన ఈ ఈవెంట్‌లో బోల్ట్ 9.85 సెకన్లలో పరుగు పూర్తిచేశాడు. మందకొడిగా ఆరంభించినప్పటికీ మధ్యలో పుంజుకున్నాడు. అమెరికాకు చెందిన మైకేల్ రొడ్జెర్స్ (9.98 సె.) రెండో స్థానంలో, సహచరుడు నెస్టా కార్టర్ (9.99 సె.) మూడో స్థానంలో నిలిచారు.  విజయం సాధించిన అనంతరం ఎప్పటిలాగే తన ట్రేడ్‌మార్క్ పోజ్ ‘టు ద వరల్డ్’తో ప్రేక్షకులను అలరించాడు. ‘ఇక్కడికి రావడాన్ని అమితంగా ఇష్టపడతాను. అభిమానుల ఉత్సాహమే నన్ను పరిగెత్తిస్తుంది.
 
 అందుకే అందరికంటే ముందుగా పోటీని పూర్తి చేయగలుగుతాను’ అని బోల్ట్ అన్నాడు. మొదట్లో కాస్త నెమ్మదించినా... తిరిగి వేగాన్ని అందుకోవడం సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. మాస్కోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కల్లా మరింత మెరుగైన టైమింగ్‌పై దృష్టిపెడతానన్నాడు. బ్రిటన్ ప్రభుత్వ పన్ను నిబంధనల వల్ల 2009 నుంచి బోల్ట్ ఈ లీగ్ పోటీల్లో పాల్గొనడం లేదు. ఈ ఏడాది విదేశీ అథ్లెట్లకు ప్రైజ్‌మనీ నుంచి పన్ను మినహాయింపులు
 ఇవ్వడంతో బోల్ట్ పోటీలకు సై అన్నాడు.
 
 శనివారం జరిగిన 4్ఠ 100 మీటర్ల రిలే ఈవెంట్‌లోనూ బోల్ట్‌కు స్వర్ణం లభించింది. బోల్ట్, వారెన్ వెయిర్, కీమర్ బెయిలీకోల్, మరియో ఫోర్సిథ్‌లతో కూడిన జమైకా బృందం పోటీని 37.75 సెకన్లలో పూర్తి చేసి కొత్త మీట్ రికార్డుతో పసిడి పతకం గెలిచింది.
 

మరిన్ని వార్తలు