జింబాబ్వే చారిత్రక విజయం

7 Nov, 2018 01:55 IST|Sakshi

 17 ఏళ్ల తర్వాత విదేశంలో తొలి టెస్టు గెలుపు 

151 పరుగులతో బంగ్లాదేశ్‌ చిత్తు   

సిల్హెట్‌: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ప్రతీ సిరీస్‌కు ముందు సమస్యలతో సతమతమవుతున్న జింబాబ్వే క్రికెట్‌ జట్టులో కొత్త ఉత్సాహం నింపే క్షణమిది! వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌నకు దురదృష్టవశాత్తూ అర్హత సాధించలేకపోయి గత ఎనిమిది నెలలుగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జట్టుకు ఊరటనిచ్చే సందర్భమిది! దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ జట్టుకు టెస్టుల్లో తొలి గెలుపు దక్కింది. మంగళవారం నాలుగో రోజే  ముగిసిన తొలి టెస్టులో జింబాబ్వే 151 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకే ఆలౌటైంది. ఇమ్రుల్‌ కైస్‌ (43), ఆరిఫుల్‌ హఖ్‌ (38) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. 17 ఏళ్ల తర్వాత జింబాబ్వేకు విదేశాల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. ఆఖరి సారిగా 2001లో కూడా బంగ్లాదేశ్‌నే చిట్టగాంగ్‌లో జింబాబ్వే ఓడించింది. 

ఓవర్‌నైట్‌ స్కోరు 26/0తో ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు శుభారంభమే లభించింది. కైస్, దాస్‌ (23) తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే బౌలర్లు బ్రండన్‌ మవుటా (4/21), సికందర్‌ రజా (3/41) దెబ్బకు బంగ్లాదేశ్‌ కుప్పకూలింది. 86 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 8 వికెట్లు చేజార్చుకుంది. మొదటి టెస్టు ఆడుతున్న ఆరిఫుల్‌ కొద్ది సేపు పోరాడి చివరి వికెట్‌గా ఔట్‌ కావడంతో జింబాబ్వే సంబరాల్లో మునిగి పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు చేసిన జింబాబ్వే బ్యాట్స్‌మన్‌ సీన్‌ విలియమ్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ విజయాన్ని జట్టు సభ్యులు తనకిచ్చిన దీపావళి కానుకగా జింబాబ్వే కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ అభివర్ణించాడు. సిరీస్‌లో జింబాబ్వే 1–0తో ఆధిక్యంలో నిలవగా, ఈ నెల 11 నుంచి ఢాకాలో రెండో టెస్టు జరుగుతుంది.    

మరిన్ని వార్తలు