సెమీఫైనల్లో సెయింట్ ఆండ్రూస్

12 Aug, 2013 23:55 IST|Sakshi
జింఖానా, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య సెయింట్ ఆండ్రూస్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్ గ్రౌండ్‌లో సోమవారం ఉత్కంఠభరితంగా జరిగిన బాలుర విభాగం క్వార్టర్‌ఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 39-36తో మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది. మొదటి అర్ధభాగంలో మెరిడియన్ జట్టు 21-16తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ మెరిడియన్ ఆటగాళ్లు కదం తొక్కడంతో ఆండ్రూస్‌పై ఆధిక్యతను చాటింది. ఆండ్రూస్ తరఫున జియాన్ 19, జోయెల్ 8, జాషువా 8 పాయింట్లు చేశారు. మెరిడియన్ జట్టులో సాద్ (14) రాణించాడు.
 
  ఇరు జట్ల స్కోరు 29-29తో సమం కావడంతో అదనపు సమయం ఆడించారు. ఇందులోనూ మెరిడియన్ ఆటగాళ్లు సత్తాచాటడంతో 36-35తో ఆండ్రూస్‌పై గెలిచే స్థితిలో నిలిచింది. అయితే చివరి నిమిషంలో జియాన్, జాషువా చెరో 2 పాయింట్లు చేయడంతో ఆండ్రూస్ 39-36తో గెలుపొందింది. మిగతా క్వార్టర్స్ పోటీల్లో  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 23-4తో డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 18-0తో సెయింట్ మైకేల్స్ స్కూల్‌పై, చిరెక్ పబ్లిక్ స్కూల్ 18-12తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించాయి. 
 
 బాలికల విభాగంలో చిరెక్ పబ్లిక్ స్కూల్ 27-7తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై గెలిచింది. చిరెక్ జట్టులో సంహిత (10), నటాష (5),  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్  జట్టులో రష్మిత (2) రాణించారు. మిగతా క్వార్టర్స్ పోటీల్లో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ 14-3తో సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ 18-2తో సెయింట్ పాయ్స్ గర్ల్స్ హైస్కూల్‌పై, సెయింట్ ఆంథోనీస్ గర్ల్స్ హైస్కూల్ 11-10తో ఇండస్ వరల్డ్ స్కూల్‌పై విజయం సాధించాయి.
మరిన్ని వార్తలు