జట్టు సమతూకంతో ఉంది

26 Jun, 2013 17:34 IST|Sakshi
జట్టు సమతూకంతో ఉంది

 భారత ఫీల్డింగ్ మెరుగైంది
 దక్షిణాఫ్రికా టూర్‌లో బౌలర్లు కీలకం
 రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య
 
 న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టును ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ ప్రశంసించాడు. జట్టు మంచి సమతూకంతో ఉందని చెప్పాడు. అలాగే ఫీల్డింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన కూడా గెలుపులో తోడ్పడిందని ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మిగతా అంశాలపై ద్రవిడ్ అభిప్రాయాలు అతని మాటల్లోనే...
 
 ఇది ఉత్తమ జట్టు: ప్రస్తుత ధోనిసేన ఉత్తమంగా ఉంది. ఫైనల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారినప్పుడు సైతం ఎలాంటి భయం లేకుండా ఆడగలిగింది. 129 పరుగులు సాధించే క్రమంలో కోహ్లి, జడేజా మధ్య భాగస్వామ్యంతో పాటు బౌలింగ్ విభాగం కూడా మెరుగైన స్థితిలో నిలిచింది.
 
 సమతూకంతో ఉంది: ఇప్పటి జట్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమతూకం. ఇంగ్లండ్‌లో బంతి ఎలా తిరిగిందో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. దీంతో భారత్‌కు జడేజాతో కలిపి ఏడుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడే అవకాశం చిక్కింది. మరోవైపు ఐదుగురు ప్రధాన బౌలర్లు కూడా ఉన్నారు. గతంలో జట్టుకు ఇలాంటి సౌకర్యం దక్కలే దు.
 
 ఫీల్డింగ్ మెరుగైంది: మైదానంలో భారత ఫీల్డర్లు చురుగ్గా కదిలారు. వారిలో చాలా శక్తి కనిపించింది. నిజంగా అద్భుతంగా ఆడారు. సెలక్టర్లదే క్రెడిట్: అద్భుత జట్టును రూపొందించినందుకు ఈ టైటిల్ క్రెడిట్ సెలక్టర్లకు చెందుతుంది. ఒక్కోసారి వారిని మర్చిపోతాం కానీ వారు చాలా మంచి పనిచేశారు. యువ ఆటగాళ్లకు సరైన అనుభవం లేదన్నారు. అయితే వారు తమ శక్తిసామర్థ్యాలను నమ్ముకున్నారు. భవిష్యత్ గురించి ఇప్పుడే ఆలోచించవద్దు: చాంపియన్స్ ట్రోఫీ విజయం 2015 ప్రపంచకప్ పోటీలకు మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అనుకోవడం సరికాదు. అందుకు ఇంకా చాలా సమయముంది.
 
 పేసర్ ఆల్‌రౌండర్ సమస్య: భారత్‌ను చాలాకాలంగా ఈ సమస్య వెంటాడుతోంది. కపిల్ తర్వాత కొద్దికాలం ప్రభాకర్ ఈ గ్యాప్ పూర్తి చేసినా ఆ తర్వాత సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జట్టుకు దొరకలేదు. ప్రస్తుతానికి ఇర్ఫాన్ కుదురుకుంటాడనిపిస్తోంది.
 సఫారీ సిరీస్ కీలకం: వన్డేలో నంబర్‌వన్‌గా ఉన్నా టెస్టులో ఆ స్థాయి ప్రదర్శన కనిపించడం లేదు. అందుకే దక్షిణాఫ్రికా పర్యటన భారత్‌కు సవాల్ కానుంది.  స్టెయిన్, ఫిలాండర్, మోర్కెల్ ఫిట్‌గా ఉంటే బ్యాట్స్‌మెన్‌కు తిప్పలు తప్పవు. బౌలర్ల ప్రదర్శనపై భారత విజయం ఆధారపడి ఉంటుంది.
 
 పేస్‌త్రయం ప్రదర్శన బాగుంది:  ఇషాంత్, భువనేశ్వర్, ఉమేశ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్ వరకు ఫిట్‌గా ఉండి మరింత రాటుదేలితే జట్టుకు ఉపయోగపడుతారు. ఒకవేళ జహీర్ ఫిట్‌గా ఉండుంటే భారత్‌కు విలువైన బౌలర్‌గా ఉపయోగపడేవాడు.
 

>
మరిన్ని వార్తలు