ప్రపంచకప్‌లో వారే కీలకమవుతారు: ద్రవిడ్‌

18 May, 2019 21:52 IST|Sakshi

బెంగళూరు: ప్రపంచకప్‌లో టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయని అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో ఈ మెగా ఈవెంట్‌ జరగనుండటంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు. ఇక ఐసీసీ టోర్నీలంటేనే ఆసీస్‌ బెబ్బులిలా రెచ్చిపోతుందన్నాడు. ఇక టీమిండియాలోని చాలా మంది ఆటగాళ్లకు ఇంగ్లండ్‌ పరిస్థితుల పట్ల అవగాహన ఉండటం కలిసొచ్చే అంశమని ద్రవిడ్‌ తెలిపాడు. జస్ప్రిత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లు మిడిల్‌ ఓవర్లలో కీలకమవుతారని వివరించాడు. 
‘ప్రస్తుతం ఇంగ్లండ్‌ పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్నాయి. హై స్కోరింగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో మిడిల్‌ ఓవర్లు కీలకమవుతాయి. టీమిండియా గెలుపోటములు మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయడంపై ఆధారపడింది. దీంతోనే కోహ్లిసేన ప్రపంచకప్‌ గెలిచేది లేనిది తెలుస్తోంది. బుమ్రా​, కుల్దీప్‌, చహల్‌లు మిడిల్‌ ఓవర్లలో వికెట్లు సాధించగలరని నమ్ముతున్నాను. గత కొంతకాలంగా టీమిండియా అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో టీమిండియా ఉండటమే దీనికి నిదర్శనం. ఇక ప్రపంచకప్‌లో కోహ్లి దూకుడు ధోని అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.’అంటూ ద్రవిడ్‌ వివరించాడు.    
 

మరిన్ని వార్తలు