ఒకే ఒక్కడు రాహుల్‌ ద్రవిడ్‌

20 Nov, 2018 12:40 IST|Sakshi

న్యూఢిల్లీ:  రాహుల్ ద్రవిడ్... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు ది వాల్, మిస్టర్ డిపెండబుల్. భారత క్రికెట్‌కు దొరికిన అరుదైన బ్యాట్స్‌మన్‌. ప్రపంచ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో నింపాదిగా ఆడే క్రికెటరే కనిపించడం లేదు. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ పది వేల పరుగుల మైలురాయిని సాధించిన బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్.  అతని గొప్పతనం అంతా అతడి టెక్నిక్‌లోనే ఉంది. టెక్నిక్ ఉంటే చాలు.. ఏ ఫార్మాట్ అయినా ఒకేలా ఆడగలరు అని నిరూపించాడు రాహుల్‌ ద్రవిడ్. అలాంటి ద్రవిడ్‌కు సంబంధించిన ఓ అరుదైన రికార్డుని బీసీసీఐ సోమవారం ట్వీట్ చేసింది.

ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా? అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో 30 వేలకుపైగా బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్. టెస్టుల్లో మొత్తం 31258 బంతులను ఎదుర్కొన్నాడు. 200 టెస్టులు ఆడిన క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌కు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. టెస్టు క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ ఆడిన బంతులు 29,437.

అంతర్జాతీయ క్రికెట్‌లో 52.31 యావరేజితో రాహుల్ ద్రవిడ్ 13,288 పరుగులు చేశాడు. మోడ్రన్‌ డే క్రికెట్‌లో ద్రవిడ్‌ నమోదు చేసిన టెస్టు యావరేజ్‌ సైతం ఒక అత్యుత్తమ సగటుగా నిలవడం మరో విశేషం. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరిస్‌ను సొంతం చేసుకోవాలని సుదీర్ఘ పర్యటనకు టీమిండియా వెళ్లిన నేపథ్యంలో ద్రవిడ్‌ ఆడిన టెస్టు బంతుల రికార్డును గుర్తు చేస్తూ బీసీసీఐ ఒక ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు