మందు కొట్టిన మత్తులో...

8 Aug, 2013 02:18 IST|Sakshi

లండన్: అప్పట్లో సైమండ్స్ తప్పతాగడం... చిందులేయడం... చేపలు పట్టడం... ఇది సహించని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆగ్రహంతో  సైమండ్స్ జట్టులో స్థానాన్నే కోల్పోయాడు. ఇటీవల జెస్సీ రైడర్ (కివీస్), వార్నర్ (ఆసీస్)లు బ్యాటింగ్‌లో మెరుపులకన్నా, తాగితూగిన ఉదంతాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రైడర్ అయితే ఏకంగా ప్రాణాల మీదికే తెచ్చుకున్నాడు.
 
 అదృష్టం ఆశపెట్టడంతో బ్రతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు. తాజాగా ఇప్పుడు ఇంగ్లండ్ స్పిన్నర్ మోంటీ పనేసర్ వంతు వచ్చినట్లుంది. అనుచిత ప్రవర్తనతో పోలీసులకు జరిమానా కట్టాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే... సోమవారం బ్రింగ్టన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో ఈ ఇంగ్లండ్ స్పిన్నర్ పీకలదాకా తాగేశాడు. ఆ నిషా తలకెక్కి ఒళ్లుమరిచాడు. క్లబ్‌కొచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడు. వాళ్ల ఫిర్యాదుతో బౌన్సర్లు అతన్ని ఈడ్చుకెళ్లి బయటికి గెంటేశారు. అసలే ఫూటుగా తాగడం... ఏం చేస్తున్నాననే ఇంగితం మరచిన పనేసర్... ఆ బౌన్సర్లపై మూత్ర విసర్జన చేశాడు. ఈ అసహ్యమైన ఘటన పోలీసుల దాకా వెళ్లింది. వార్నింగ్ ఇచ్చి, రూ.8300 (90 పౌండ్లు) జరిమానా విధించారు. దీనిపై సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ విచారణకు ఆదేశించింది. ఆ క్రికెటర్ ప్రతినిధి జరిగిన ఘటనపై పనేసర్ క్షమాపణ కోరాడని చెప్పారు.
 

మరిన్ని వార్తలు