డుప్లెసిస్‌ సంచలన నిర్ణయం

17 Feb, 2020 15:08 IST|Sakshi

ఈ కెప్టెన్సీ నాకొద్దు

కేప్‌టౌన్‌:  దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌ బై చెబుతూ క్రికెట్‌ దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న డుప్లెసిస్‌ ఉన్నపళంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు తాను ఆటగాడిగా అందుబాటులో ఉంటానని డుప్లెసిస్‌ తన ప్రకటనలో వెల్లడించాడు. కొత్త నాయకత్వంలో దక్షిణాఫ్రికా మరింత ముందుకు వెళుతుందని ఆశించే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికాకు నూతన సారథ్యం అవసరం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇంతకాలం దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా చేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు డుప్లెసిస్‌ తెలిపాడు. (ఇక్కడ చదవండి: ఏబీ ఫామ్‌లో ఉంటేనే: బౌచర్‌)

టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత తన భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని ఇటీవల తెలిపిన డుప్లెసిస్‌.. దానిలో భాగంగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి ముందుగా గుడ్‌ బై చెప్పడం గమనార్హం. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు, టీ20 సిరీస్‌కు డుప్లెసిస్‌కు విశ్రాంతి ఇచ్చారు. దాంతో సఫారీ కెప్టెన్సీ పగ్గాలను డీకాక్‌ తీసుకున్నాడు. డీకాక్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లను కోల్పోయినా ఆశించిన స్థాయిలో రాణించింది. కెప్టెన్సీ పగ్గాలను మోస్తూనే డీకాక్‌ తన బ్యాటింగ్‌ జోరుతో ఆకట్టుకున్నాడు. తన వారసుడిగా డీకాక్‌ సరైనడివాడని భావిస్తున్న డుప్లెసిస్‌.. అందుకు ఇదే తగిన సమయం అని భావించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. డుప్లెసిస్‌ కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్న విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తన ట్వీటర్‌ అకౌంట్‌లో ‘బ్రేకింగ్‌’ అంటూ పోస్ట్‌ చేసింది. (ఇక్కడ చదవండి: మైదానంలోకి మహిళా అతిథి.. డీకాక్‌ దరహాసం)


గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో డుప్లెసిస్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ఘోరంగా చతికిలబడింది. ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1తో డుప్లెసిస్‌ సారథ్యంలోని సఫారీ జట్టు కోల్పోయింది. మరొకవైపు డుప్లెసిస్‌ సైతం పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. గత 14 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో డుప్లెసిస్‌ యావరేజ్‌ 20.92గా ఉంది. దాంతో డుప్లెసిస్‌ కెప్టెన్సీపై విమర్శలు రాకముందే అతను ఆ బాధ్యతల నుంచి తప్పుకుని ఒత్తిడి తగ్గించుకున్నాడు. 

మరిన్ని వార్తలు