ఫైనల్‌ సవాల్‌

13 Dec, 2017 00:42 IST|Sakshi

నేటి నుంచి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ

బరిలో టాప్‌–8 షట్లర్లు

టైటిల్‌పై సింధు, శ్రీకాంత్‌ ఆశలు

ఏడాది మొత్తం ప్రదర్శించిన ఆట ఒక ఎత్తు... ప్రతీ మ్యాచ్‌ ఒక పెద్ద టోర్నీ ఫైనల్‌లాగే సాగే ఈ టోర్నీ ఒక ఎత్తు... సంవత్సరం మొత్తం సాగించిన జోరును మరో టోర్నీలో కొనసాగించి సీజన్‌ను అద్భుతంగా ముగించేందుకు టాప్‌ షట్లర్లందరికీ ఇది మరో అవకాశం. డజను సూపర్‌ సిరీస్‌ టోర్నీలలో పెద్దా, చిన్న ప్రత్యర్థులతో తలపడి తుది పోరుకు అర్హత సాధించినవారు మరో ఐదు రోజుల పాటు సమాన స్థాయి ఆటగాళ్లను ఎదుర్కొని సత్తా చాటేందుకు ఇది తగిన వేదిక. ప్రపంచ బ్యాడ్మింటన్‌కు పెద్దన్నలాంటి సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ పోటీల సవాల్‌కు టాప్‌–8 ఆటగాళ్లంతా సన్నద్ధమయ్యారు. ఈ పోరులో తుది విజయం ఎవరిదో వేచి చూడాలి.   

దుబాయ్‌ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ పోటీలకు రంగం సిద్ధమైంది. ఇక్కడి హమ్‌దాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం టాప్‌–8 స్థానాల్లో ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇందులో పాల్గొంటున్నారు. ఫలితంగా ప్రతీ మ్యాచ్‌ హోరాహోరీగా, రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఆటగాళ్లను రెండు గ్రూప్‌లలో విభజించారు. ఒక్కో గ్రూప్‌లో తమ ముగ్గురు ప్రత్యర్థులతో షట్లర్లు తలపడతారు. మూడు మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో టాప్‌–2లో నిలిచినవారు సెమీస్‌కు అర్హత సాధిస్తారు. పాయింట్లు సమమైతే గెలిచిన గేమ్‌లు, ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఫైనల్స్‌ టోర్నీలో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ బరిలో ఉన్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాల తర్వాత ఇక్కడ కూడా విజేతగా నిలవాలని సింధు పట్టుదలగా ఉండగా... ఈ ఏడాది రికార్డు స్థాయిలో నాలుగు సూపర్‌ సిరీస్‌ టోర్నీలు గెలిచిన శ్రీకాంత్‌ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న చైనా స్టార్‌ ప్లేయర్‌ చెన్‌ లాంగ్‌ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో గ్రూప్‌ ‘ఎ’లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే పోటీ ఉన్నారు.
 
సింధుకు సులువే...
సింధు తొలి మ్యాచ్‌లో చైనాకు చెందిన హి బింగ్‌జియావోతో తలపడుతుంది.  ప్రస్తుతం సింధు 3వ ర్యాంక్‌లో, బింగియావో 9వ ర్యాంక్‌లో ఉన్నారు. వీరిద్దరి మధ్య 9 మ్యాచ్‌లు జరగ్గా సింధు 4 గెలిచి, 5 ఓడింది.  ఈ ఏడాది ఆరంభంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓడిన సింధు... ఇటీవల కొరియా ఓపెన్‌లో ఇదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. సింధు రెండు సూపర్‌ సిరీస్‌ విజయాలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి ఫామ్‌లో ఉండగా, బింగ్‌జియావో 2017లో ఒక్క జపాన్‌ ఓపెన్‌లో మాత్రమే రన్నరప్‌గా నిలవగలిగింది. కాబట్టి పరిస్థితి సింధుకే అనుకూలంగా కనిపిస్తోంది.  

శ్రీకాంత్‌కు పరీక్ష...
కిడాంబి శ్రీకాంత్‌ మాత్రం తొలి మ్యాచ్‌లో వరల్డ్‌ నంబర్‌వన్, సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌ పోటాపోటీగా సాగే అవకాశం ఉంది. ఇందులో గెలిస్తే గ్రూప్‌లో మిగతా ఇద్దరిని ఓడించడం శ్రీకాంత్‌కు కష్టం కాకపోవచ్చు.  ఈ సంవత్సరం రెండు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన విక్టర్‌ ఒకదాంట్లో రన్నరప్‌గా నిలిచాడు. అదే శ్రీకాంత్‌ నాలుగు టైటిల్స్‌తో సత్తా చాటాడు. వీరిద్దరి మధ్య రికార్డు 3–3తో సమంగా ఉంది. అయితే 2017లో వరుసగా రెండు సార్లు ఓడిన తర్వాత విక్టర్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి శ్రీకాంత్‌ దెబ్బ తీశాడు.

12 టోర్నీల ద్వారా...
ఏడాదిలో జరిగే 12 సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లో ఆటగాళ్లు చూపిన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఇక్కడ సీడింగ్స్‌ను ఖాయం చేస్తారు. వీటిలో ఐదు సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ ఈవెంట్‌లు, మరో ఏడు సూపర్‌ సిరీస్‌ ఈవెంట్‌లు ఉన్నాయి. సూపర్‌ సిరీస్‌ టోర్నీలలో ప్రదర్శన మాత్రమే చూస్తారు కాబట్టి అర్హత సాధించేందుకు వరల్డ్‌ ర్యాంక్‌ ఇక్కడ వర్తించదు. ఫైనల్స్‌ కోసం మరో ర్యాంక్‌ను ఇస్తారు. సన్‌ వాన్‌ హో వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంక్‌లో ఉన్నా... ఇక్కడ అతను నంబర్‌వన్‌. విక్టర్‌ అక్సెల్‌సన్‌ ర్యాంక్‌ 8 కాగా... శ్రీకాంత్‌ దుబాయ్‌ ర్యాంకింగ్‌ 2 (వరల్డ్‌ ర్యాంక్‌ 4). అయితే ఈ టోర్నీలో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు ఆటగాళ్లకు లేదా రెండు జోడీలకు మాత్రమే అవకాశం లభిస్తుంది. టోర్నమెంట్‌ మొత్తం ప్రైజ్‌మనీ బ్యాడ్మింటన్‌లో అత్యధికంగా 10 లక్షల డాలర్లు (రూ. దాదాపు 6 కోట్ల 46 లక్షలు) కావడం విశేషం. సింగిల్స్‌ విజేతలకు 80 వేల డాలర్ల (రూ. 51 లక్షలు) చొప్పున లభిస్తాయి.  

ఏ గ్రూప్‌లో ఎవరంటే... మహిళల సింగిల్స్‌  
గ్రూప్‌ ‘ఎ’: పీవీ సింధు (భారత్‌), అకానె యామగుచి (జపాన్‌), సయాకా సాటో (జపాన్‌), హీ బింగ్‌జియావో (చైనా).
గ్రూప్‌ ‘బి’: తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), సుంగ్‌ జీ హున్‌ (కొరియా), రచనోక్‌ (థాయ్‌లాండ్‌), చెన్‌ యుఫె (చైనా).

పురుషుల సింగిల్స్‌
గ్రూప్‌ ‘ఎ’: సన్‌ వాన్‌ హో (కొరియా), లీ చోంగ్‌ వీ (మలేసియా), ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌).
గ్రూప్‌ ‘బి’: కిడాంబి శ్రీకాంత్‌ (భారత్‌), అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), చౌ టియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ), షి యుకి (చైనా).

అత్యుత్తమ ప్రదర్శన సైనా, జ్వాలదే...
2008 నుంచి జరుగుతోన్న వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో ఇప్పటివరకు భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన రజత పతకమే. 2011లో మహిళల సింగిల్స్‌ విభాగంలో సైనా... 2009లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు జంట రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు గెలిచారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నాలుగుసార్లు సెమీఫైనల్‌కు (2008, 2009, 2012, 2014) చేరుకోగా... రెండుసార్లు లీగ్‌ దశలో (2013, 2015) నిష్క్రమించింది. గతేడాది సింధు తొలిసారి ఈ టోర్నీకి అర్హత సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇక పురుషుల సింగిల్స్‌ విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌ మూడోసారి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు. 2014లో సెమీస్‌కు చేరిన అతను 2015లో లీగ్‌ దశలో వెనుదిరిగాడు. గతేడాది శ్రీకాంత్‌ అర్హత పొందలేకపోయాడు.  
నేటి సాయంత్రం గం. 4.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు