దులీప్‌ ట్రోఫీ విజేత ఇండియా ‘రెడ్‌’

29 Sep, 2017 00:43 IST|Sakshi

లక్నో: దేశవాళీ క్రికెట్‌ సీజన్‌లో తొలి టోర్నమెంట్‌ దులీప్‌ ట్రోఫీలో ఇండియా ‘రెడ్‌’ జట్టు విజేతగా నిలిచింది. ఇండియా ‘బ్లూ’తో జరిగిన డే నైట్‌ ఫైనల్లో ఇండియా ‘రెడ్‌’ 163 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు రోజులపాటు జరగాల్సిన ఫైనల్‌ నాలుగో రోజే ముగిసింది. 393 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా ‘బ్లూ’ 48 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ‘రెడ్‌’ జట్టు ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ 87 పరుగులకు 6 వికెట్లు తీసి ‘బ్లూ’ జట్టును దెబ్బతీశాడు.

‘బ్లూ’ జట్టులో సురేశ్‌ రైనా (51 బంతుల్లో 45; 7 ఫోర్లు), భార్గవ్‌ భట్‌ (41 బంతుల్లో 51; ఫోర్, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ఫైనల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన వాషింగ్టన్‌ సుందర్‌కు (130 పరుగులు; 11 వికెట్లు) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది. అంతకుముందు నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 187/7తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇండియా ‘రెడ్‌’ జట్టు 208 పరుగులకు ఆలౌటై ‘బ్లూ’ జట్టుకు 393 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

>
మరిన్ని వార్తలు