-

‘ద్యుతీ చంద్‌ ప్రమాదంలో ఉంది’

20 May, 2019 16:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓ టీనేజ్‌ అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు భారత మహిళా రన్నర్‌ ద్యుతీ చంద్‌ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో సహజీవనంపై బాహాటంగా అంగీకరించిన తొలి భారత అథ్లెట్‌గా ద్యుతీ నిలిచింది.  ఈ విషయమై తన కుటుంబంలో కలతలు చెలరేగాయని కూడా ఆమె చెప్పింది.  ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్‌ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని బాహాటంగానే వెల్లడించింది. తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, తనను ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని బెదిరించిందని వెల్లడించింది.

ఆమె అన్నట్లుగానే ద్యుతీ సోదరి సరస్వతీ చంద్‌ మీడియా వేదికగా ద్యుతీ సహజీవనాన్ని వ్యతిరేకించింది. ద్యుతీ చంద్‌ను ఆ అమ్మాయి, వారి కుటింబీకులు బెదిరించారని, పెళ్లిచేసుకోవాలని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాకుండా ఆమె ఆస్తిపై కన్నేశారని, ద్యుతీని ఆట నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంతో ద్యుతీ జీవితం ప్రమాదంలో పడిందని అథ్లెట్‌ అయిన సరస్వతీ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాదంలో ఉన్న తన సోదరికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరింది.

ద్యుతీ బంధానికి మద్దతుగా నిలుస్తారా? అన్న ప్రశ్నకు .. ‘అమె అడల్ట్‌. ఏ నిర్ణయమైనే తీసుకునే హక్కు ద్యుతీకి ఉంది. అబ్బాయా? అమ్మాయా? ఎవరినైనా ఆమె ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకరు బలవంతం పెట్టడం వల్ల ద్యుతీ ఇదంతా మాట్లాడుతుంది.  ద్యుతీ విజయం కోసం కృషి చేసిన వారంత ఆమెకు ఇప్పుడు ఆపరాధులుగా కనిపిస్తున్నారు. 2020 ఒలింపిక్స్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌లపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ద్యుతీ ఇరుక్కుంది. ఆమె విజయాలు సాధించినప్పుడు ద్యుతీతో పాటు కుటుంబసభ్యులు మన్ననలు పొందారు. పిల్లలు విజయాలు సాధిస్తే వారితో పాటు వారి తల్లిదండ్రులకు పేరు వస్తుంది. అదే తప్పుచేస్తే.. కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.’ అని సరస్వతి ఆవేదన వ్యక్తం చేసింది.

అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్‌

మరిన్ని వార్తలు