ద్యుతి చంద్‌ డబుల్‌ ధమాకా!

29 Aug, 2018 19:37 IST|Sakshi

ట్రిపుల్‌ జంప్‌లో భారత్‌కు స్వర్ణం

హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన బర్మాన్‌ స్వప్న

54కు చేరిన భారత పతకాల సంఖ్య

జకార్త: ఏషియన్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్‌ ద్యుతి చంద్‌ మరో పతకం సాధించారు. ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో రజతం సాధించిన ఆమె.. బుధవారం జరిగిన 200 మీటర్ల ఫైనల్లో 23.20 సెకన్లలో పరుగును పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో ద్యుతి మరో రజత పతకం సొంతం చేసుకున్నారు. 22.96 సెకనల్లో బెహ్రెయిన్‌ అథ్లెట్‌ ఓడియంగో ఎడిడాంగ్‌ స్వర్ణం గెలవగా.. 23.27 సెకన్లతో వుయ్‌యాంగీ(చైనా) కాంస్యం సొంతం చేసుకున్నారు.

ఆసియా క్రీడల్లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధించిన పీటీ ఉష, జ్యోతిర్మయి వంటి దిగ్గజ అథ్లెట్ల సరసన నిలిచారు. ఇక 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా కూడా ద్యుతి గుర్తింపు పొందారు.1986లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో పీటీ ఉష 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్‌, 4×400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి రికార్డు సృష్టించారు. 1998 బ్యాంకాక్‌ క్రీడల్లో జ్యోతిర్మయి సిక్దార్‌ 800 మీటర్లు, 1500 మీటర్లలో రెండు పతకాలు సాధించారు. 2002 బుసాన్‌ క్రీడల్లో సునితా రాణి 1500 మీటర్లు, 500 మీటర్లలో రెండు పతకాలతో మెరిసారు. 

ద్యుతీచంద్‌లో అధిక మోతాదులో పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్‌) ఉన్నాయి కాబట్టి ఆమెకు మహిళల విభాగంలో పాల్గొనే అర్హత లేదంటూ కామన్వెల్త్‌ క్రీడల నుంచి తప్పించారు. స్పోర్ట్స్‌ ఆర్బిట్రేజ్‌ కోర్టులో పోరాడిన ద్యుతీ తిరిగి కఠోర సాధన చేసింది. అకుంఠిత దీక్షతో అందరినీ మెప్పించింది.

భారత్‌కు రెండు స్వర్ణాలు
హెప్టాథ్లాన్‌ మహిళల విభాగం, పురుషుల ట్రిపుల్‌ జంప్‌ విభాగల్లో భారత్‌కు స్వర్ణం లభించింది. బర్మాన్‌ స్వప్న 5218 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచి పసిడి సొంతం చేసుకుంది. పురుషుల ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో భారత అథ్లెట్‌ అర్పిందర్‌ 16.77 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. దీంతో 48 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ ఈవెంట్‌ స్వర్ణం వరించింది. 1970లో మోహిందర్‌ సింగ్‌ 16.11 మీటర్లతో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత భారత అథ్లెట్‌ మళ్లీ పసిడి అందుకోవడం ఇదే తొలిసారి.  ఫైనల్‌కు అర్హత సాధించిన మరో భారత అథ్లెట్‌ రాకేశ్‌ ఆరోస్థానంతో సరిపెట్టుకున్నాడు. 

టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యం..
టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. శరత్‌ కమల్‌, మనికా బాత్రా జోడీ  సెమీస్‌లో కఠిన ప్రత్యర్థి చైనాతో  9-11, 5-11, 13-11, 4-11, 8-11 తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో  భారత పతకాల సంఖ్య(11 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలు) 54కు చేరింది.

మరిన్ని వార్తలు