‘మాకేం అరవై ఏళ్లు లేవు’

27 Mar, 2019 18:18 IST|Sakshi

న్యూఢిల్లీ: పదేపదే చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ‘డాడీ ఆర్మీ’అంటూ ఎగతాళి చేస్తున్న వారిపై ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన బ్రేవో.. ‘మా వయసు గురించి మాకు తెలుసు. ఇంకొకరు చెప్పక్కర్లేదు. సీఎస్‌కే ఆటగాళ్ల వయసు 32-35 మధ్యే ఉంది. మా జట్టులోని ఆటగాళ్లందరూ ఫిట్‌గా  ఉన్నారు. మాకేం అరవై ఎళ్లు లేవు. వయసు కాదు ఆట, ఆనుభవం ముఖ్యం. ఈ విషయాన్ని మేధావులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో’అంటూ సీఎస్‌కే విమర్శకులపై మండిపడ్డాడు. 

బ్యాటింగ్‌, బౌలింగ్‌తో రాణిస్తాం
ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంత గడ్డపై ఓడించిన అనంతరం సీఎస్‌కే సారథి ఎంఎస్‌ ధోని మాట్లాడుతూ..‘మేం ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేస్తున్న మాట వాస్తవం. అయితే ఆ లోటును బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పూడుస్తున్నాం. మా బౌలింగ్‌, బ్యాటింగ్‌ అద్భుతంగా ఉంది. చివరి ఓవర్లలో ఇంకా బాగా ఆడాల్సి వుంది. కానీ మంచి క్రికెట్‌ ఆడామనుకుంటున్నాం. ఫీల్డింగ్‌ లోపాలపై దృష్టి పెడతాం’అంటూ వివరించారు. ఇక ఈ మ్యాచ్‌లో బ్రేవోతో పాటు సీఎస్‌కే బౌలర్లు రాణించడంతో ఢిల్లీ 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం వాట్సన్‌(44), రైనా(30), ధోని(35 నాటౌట్‌) రాణించడంతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసి లీగ్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.  
(చదవండి: ‘డాడీ ఆర్మీ’ అన్నారు కదా.. ఏమైంది?)

మరిన్ని వార్తలు