ధోని, కోహ్లిలపై బ్రేవో అదిరే సాంగ్!

9 Feb, 2019 17:12 IST|Sakshi

ముంబై : వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో మైదానంలో బంతి, బ్యాట్‌తోనే కాకుండా తన ఆట, పాటలతో అభిమానులను అలరిస్తాడన్న విషయం తెలిసిందే. వికెట్‌ తీసినప్పుడైనా.. మ్యాచ్‌ గెలిచినప్పుడైనా సంతోషంలో అతను వేసే చిందులు కనువిందును చేస్తాయి. అయితే ఈ క్రికెట్‌ర్‌ కమ్‌ సింగర్‌ 2018 అక్టోబర్‌లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఆయా దేశవాళీ టీ20 లీగ్‌ల్లో మాత్రం ఆడుతానని స్పష్టం చేశాడు. ఇక 2016 టీ20 ప్రపంచకప్‌ విజయానంతరం ‘ఛాంపియన్‌’  సాంగ్‌ను విడుదల చేసి తనో మంచి సింగర్‌నని చాటుకున్న ఈ కరేబియన్‌ క్రికెటర్‌.. తాజాగా మరో ఆల్భమ్‌ను విడుదల చేశాడు. ఈ సారి ఆసియా క్రికెటర్లను ప్రస్తావిస్తూ అతను పాడిన పాట ఆకట్టుకుంటోంది. ఆసియా క్రికెటర్లు కుమార సంగాక్కర, మహేళ జయవర్ధనే, విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ధోని, షకీబుల్‌ హసన్‌, షాహిదీ అఫ్రీదీ, రషీద్‌ ఖాన్‌లను ప్రస్తావిస్తూ ‘దిస్‌ వన్‌ ఈజ్‌ ఏషియా’ గా ఈ పాటను రూపొందించాడు. ఈ సాంగ్‌ను పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహీద్‌ అఫ్రీదీ కొనియాడుతూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

‘బ్రేవో అద్భుతం.. ఇది పక్కా చాంపియన్‌ సాంగ్‌కు మించి ఉంది. ముఖ్యంగా ఈ పాటలో నా పేరు ప్రస్తావించడం బాగుంది. ఇది విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశాడు. బ్రేవో అనేక టీ20 లీగ్‌ల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ లయన్స్‌, ముంబై ఇండియన్స్‌  తరఫున బరిలోకి దిగాడు. అలాగే పీఎస్‌ఎల్‌, బీబీఎల్‌, సీపీఎల్‌ల్లో కూడా పాల్గొన్నాడు. టెస్ట్‌ల్లో 86 వికెట్లతో 2200 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. వన్డేల్లో 2986 పరుగులు చేసి 199 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 52 వికెట్లతో పాటు 1142 పరుగులు తనఖాతాలో వేసుకున్నాడు.

మరిన్ని వార్తలు