బ్రేవో వీడ్కోలు

26 Oct, 2018 05:20 IST|Sakshi
డ్వేన్‌ బ్రావో

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్‌ ఆల్‌రౌండర్‌

టి20 లీగ్‌లు ఆడతానని ప్రకటన

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: టి20 స్పెషలిస్ట్‌ ఆల్‌రౌండర్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులకు చిర పరిచితమైన వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అయితే, టి20 లీగ్‌లు మాత్రం ఆడతానని తెలిపాడు.  35 ఏళ్ల బ్రావో... 2004లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టు ద్వారా వెస్టిండీస్‌ తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌పై జార్జిటౌన్‌లో తొలి వన్డే ఆడాడు. 40 టెస్టుల్లో 2,200 పరుగులు చేసి, 86 వికెట్లు పడగొట్టాడు. 164 వన్డేల్లో 2,968 పరుగులు, 199 వికెట్లు తీశాడు. టి20ల్లో మరింత ప్రభావవంతుడైన ఈ ఆల్‌రౌండర్‌ 2012, 2016 టి 20 ప్రపంచ కప్‌ నెగ్గిన వెస్టిండీస్‌ జట్టులో సభ్యుడు. ఈ ఫార్మాట్‌లో 66 మ్యాచ్‌ల్లో 1,142 పరుగులు చేసి, 52 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఆడాడు.

కెరీర్‌ అలా ముగిసింది: బ్రావో టెస్టు కెరీర్‌ 2010లోనే ముగిసింది. 2014లో భారత్‌లో పర్యటించిన విండీస్‌ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రావోకు ఆ సిరీసే చివరిదైంది. బోర్డుతో వివాదాల నేపథ్యంలో నిరసన తెలిపేందుకు  ధర్మశాలలో జరిగిన నాలుగో వన్డేలో టాస్‌ వేసేందుకు జట్టంతటినీ మైదానంలోకి తీసుకొచ్చి సంచలనం రేపాడు. తర్వాత విండీస్‌ జట్టు చివరిదైన ఐదో వన్డే, ఏకైక టి20, మూడు టెస్టులు ఆడకుండానే స్వదేశం వెళ్లిపోయింది. దీంతో ధర్మశాల మ్యాచ్‌తోనే ఆల్‌రౌండర్‌ వన్డే కెరీర్‌ ముగిసినట్లైంది. 2016లో అబుదాబిలో పాకిస్తాన్‌తో చివరి టి20 ఆడిన బ్రావో... ప్రస్తుతం విండీస్‌ దీవులతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్‌లలో నిర్వహించే టి20 లీగ్‌లలో పాల్గొంటున్నాడు. మారిన పరిణామాలతో దేశం తరఫున 2019 వన్డే ప్రపంచ కప్‌ ఆడతాడని భావించారు. కానీ, అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

మరిన్ని వార్తలు