మరో నలుగురు స్టార్స్

22 Oct, 2013 00:57 IST|Sakshi
ముంబై: ఐపీఎల్ తరహాలోనే ఫుట్‌బాల్‌లో త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఆడేందుకు మరో న లుగురు మాజీ అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు అంగీకరించారు. జుంగ్‌బర్గ్, స్ట్రయికర్ డ్వైట్ యార్క్, పైర్స్, క్రెస్పో ఈ లీగ్‌కు అందుబాటులో ఉంటామని ధృవీకరించినట్టు నిర్వాహకులు ఐఎంజీ-రిలయన్స్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి మార్చి 30 వరకు జరిగే ఈ లీగ్‌లో మాంచెస్టర్ యునెటైడ్ మాజీ గోల్ కీపర్ పీటర్ ష్మిచెల్, 1998లో ప్రపంచకప్ గెలుచుకున్న ఫ్రాన్స్ జట్టులో సభ్యుడు మార్సెల్ డెసల్లీ రెండు ఫ్రాంచైజీలకు మేనేజర్లుగా వ్యవహరించనున్నారు.
 
  పదేళ్ల పాటు ఈ లీగ్‌లో సంయుక్త భాగస్వామ్యులుగా ఉంటూ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు స్టార్ ఇండియాతో ఐఎంజీ ఒప్పందం చేసుకుంది. భారత్‌లో  ఫుట్‌బాల్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు జరుగుతున్న ఈ లీగ్‌లో ఎనిమిది నగరాల పేర్లతో జట్లు పాల్గొంటాయి. ఆయా జట్లలో 22 మంది ఆటగాళ్లుంటారు. వీరిలో 10 మంది విదేశీ, ఎనిమిది మంది దేశవాళీ, అండర్-23 విభాగానికి చెందిన నలుగురు స్థానిక ఆటగాళ్లుంటారు. ఫ్రాంచైజీల కోసం బిడ్డింగ్ ఈనెల 25 నుంచి నవంబర్ 5 మధ్య జరిగే అవకాశం ఉంది. జట్లను కొనేందుకు కనీస ధర రూ.25 కోట్లు. మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న ఐ-లీగ్‌కు చెందిన చాలా క్లబ్బులు (మహ్మదన్ స్పోర్టింగ్, యునెటైడ్ మినహా) తమ ఆటగాళ్లను ఐఎస్‌ఎల్ కోసం విడుదల చేసేందుకు అంగీకరించడం లేదు. 
 
మరిన్ని వార్తలు