వరంగల్‌ వారియర్స్‌కు తొలి ఓటమి

3 Mar, 2020 14:16 IST|Sakshi

తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ సీజన్‌–3లో దూసుకుపోతోన్న వరంగల్‌ వారియర్స్‌ జట్టుకు తొలి దెబ్బ పడింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో వరంగల్‌ వారియర్స్‌ ఓటమి పాలైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్‌ 52–35తో వరంగల్‌ వారియర్స్‌పై గెలుపొంది వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. నల్లగొండ ఈగల్స్‌ రైడర్‌ మల్లికార్జున్‌ 23 రైడ్‌ పాయింట్లతో విజృంభించడంతో మ్యాచ్‌ ఆరంభం నుంచి ఆ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత 26–14తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తర్వాత రెండో అర్ధభాగంలోనూ అదే జోరు కనబరిచి 26–21తో మ్యాచ్‌ను గెలుపొందింది. మల్లికార్జున్‌ ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకోగా... 5 పాయింట్లు సాధించిన సాయి రామ్‌ (నల్లగొండ ఈగల్స్‌) ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 

మరో మ్యాచ్‌లో కరీంనగర్‌ కింగ్స్‌ 60–22తో హైదరాబాద్‌ బుల్స్‌పై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో కరీంనగర్‌ కింగ్స్‌ 33–8తో దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్‌ కాస్త పోరాడినప్పటికీ కరీంనగర్‌ కింగ్స్‌ ఎక్కడా తగ్గకుండా పాయింట్లు సాధించింది. 15 రైడ్‌ పాయింట్లు సాధించిన మునీశ్‌ కుమార్‌ ‘బెస్ట్‌ రైడర్‌’గా, 6 పాయింట్లు సాధించిన శివ కుమార్‌ ‘బెస్ట్‌ డిఫెండర్‌’గా నిలిచారు. మరో మ్యాచ్‌లో మంచిర్యాల టైగర్స్‌ 42–31తో గద్వాల్‌ గ్లాడియేటర్స్‌ను ఓడించి టోర్నీలో మూడో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టు తరఫున నితిన్‌ పన్వర్‌ 14 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. తొలి అర్ధభాగంలో 22–15తో ఆధిక్యంలో నిలిచిన మంచిర్యాల టైగర్స్‌ రెండో అర్ధభాగంలో మరో 20–16తో మ్యాచ్‌ను గెలుపొందింది. ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నితిన్‌.. ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా శుభమ్‌ నిలిచారు.   
 

మరిన్ని వార్తలు