ప్రాక్టీస్‌ జోరుగా...

22 Jan, 2018 04:07 IST|Sakshi
ప్రాక్టీస్‌ ముగిసిన అనంతరం పాండ్యా, దినేశ్‌ కార్తీక్, బుమ్రా

మూడో టెస్టుకు భారత ప్రధాన ఆటగాళ్ల సన్నాహాలు 

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత్‌ మూడో టెస్టులోనైనా మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉంది. ఈ నెల 24 నుంచి ఇక్కడి వాండరర్స్‌ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆదివారం వారంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. సెంచూరియన్‌ పరాజయం తర్వాత మూడు రోజులు విశ్రాంతి తీసుకొని సరదాగా విహరించిన జట్టు సభ్యులంతా నెట్స్‌కు హాజరై చెమటోడ్చారు.

ఫుట్‌బాల్‌ ఆడి వార్మప్‌ చేసిన తర్వాత ముందుగా జట్టు ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టింది. పార్థివ్, రాహుల్, రహానే, రోహిత్, దినేశ్‌ కార్తీక్‌లతో కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ స్లిప్‌ ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేయించారు. మంగళవారమే జొహన్నెస్‌బర్గ్‌ చేరుకున్న ప్రాక్టీస్‌ బౌలర్లు శార్దుల్‌ ఠాకూర్, నవదీప్‌ సైని బంతులు విసరగా రాహుల్, విజయ్, పుజారా ఒకేసారి సాధన చేశారు. విజయ్, రాహుల్‌కు స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ఎక్కువ సేపు బౌలింగ్‌ చేశారు. అనంతరం కోహ్లి, రహానే, పాండ్యా బ్యాటింగ్‌కు దిగారు.

తొలి రెండు టెస్టులకు జట్టులో స్థానం లభించని రహానే చాలా సేపు ఆడటం విశేషం. ప్రధాన పేసర్లు భువీ, షమీ వీరికి బౌలింగ్‌ చేశారు. మరో వైపు పిచ్‌పై ఉన్న పచ్చికను ఆదివారం కొంతవరకు తొలగించారు. ‘వికెట్‌పై తగినంత పచ్చిక ఉంచాం. మ్యాచ్‌కు ముందు దీనిని తగ్గించకపోవచ్చు. సరిపోయేంత నీటిని కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి సెంచూరియన్‌ తరహాలో పొడిబారిపోయే ప్రమాదం లేదు. దక్షిణాఫ్రికా జట్టు కోరిక మేరకే దీనిని సిద్ధం చేశాం.  పేస్, బౌన్స్‌కు పిచ్‌ అనుకూలంగా ఉంటుంది’ అని వాండరర్స్‌ క్యురేటర్‌ బేతుల్‌ బుతెలెజి చెప్పారు.   

మరిన్ని వార్తలు