గంగూలీ సందులో గులాబీ గోల

21 Nov, 2019 01:37 IST|Sakshi

‘పింక్‌ టెస్టు’కు భారీ ఆకర్షణలు

చిరస్మరణీయం చేసేందుకు సన్నాహాలు

హుగ్లీ తీరం అయినా... హౌరా బ్రిడ్జ్‌ అయినా... షహీద్‌ మినార్‌ అయినా... క్లాక్‌ టవర్‌ అయినా... కాళీ ఘాట్‌ అయినా... చౌరంఘీ లైన్‌ అయినా... ఇప్పుడంతా గులాబీమయమే! దేశ సాంస్కృతిక రాజధాని ఇప్పుడు పూర్తిగా గులాబీ రంగు పులుముకుంది. పింక్‌ సిటీగా జైపూర్‌ నగరానికి పేరున్నా ప్రస్తుతానికి మాత్రం గులాబీ గుబాళింపులన్నీ ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’లోనే కనిపిస్తున్నాయి... కోల్‌కతాలో ఎక్కడ చూసినా ఇప్పుడు పింక్‌ టెస్టు పలుకులే.

మ్యాచ్‌ జరిగేది ఈడెన్‌    గార్డెన్స్‌లోనే అయినా క్రికెట్‌ను ప్రేమించే చారిత్రక నగరానికి ఇప్పుడు కొత్త శోభ వచ్చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే తొలిసారి జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టును విజయవంతం చేయడంలో తమకూ బాధ్యత ఉన్నట్లుగా దాదాపు కోల్‌కతావాసులంతా భావిస్తున్న పరిస్థితి... ఇంతటి అభిమానం తన వెనక ఉండగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పింక్‌ టెస్టును సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు,   చిరస్మరణీయంగా మార్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తున్నాడు.   

కోల్‌కతా: భారత్, బంగ్లాదేశ్‌ మధ్య రేపటి నుంచి జరిగే డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌కు పలు ఆకర్షణలు తోడవుతున్నాయి. గతంలో క్రికెట్‌ సంబంధిత పలు భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) ఈ సారి కూడా తమ హంగామాలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. సొంత సంఘానికి తోడు ‘దాదా’ సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష హోదాలో కూడా ఉండటం వారికి అదనపు బలాన్ని ఇచ్చింది. దాంతో ఆతిథ్యం అద్భుతంగా ఉండేందుకు ‘క్యాబ్‌’ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా సౌరవ్‌ గంగూలీనే అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాడు. టెస్టు మ్యాచ్‌ సందర్భంగా చేయబోయే ప్రత్యేక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా మాజీ కెపె్టన్‌ వివరించాడు.  

రూనా లైలా పాట...
బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఈ టెస్టు మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ప్రతిష్టాత్మక ఈడెన్‌ గార్డెన్స్‌లోని గంటను ఆమె మోగిస్తారు. హసీనాతో పాటు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత క్రికెట్‌ దిగ్గజాలు సునీల్‌ గావస్కర్, కపిల్‌ దేవ్, సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే తదితరులు తొలి రోజు ఆటను ప్రత్యక్షంగా తిలకిస్తారు. టీ విరామ సమయంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనాల్లో భారత మాజీ కెప్టెన్లు స్టేడియంలో కలియతిరగనున్నారు. అదే సమయంలో సంగీత కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు జీత్‌ గంగూలీ, బెంగాలీ గాయని రూనా లైలా తదితరులతో ఈ కార్యక్రమం ఉంటుంది.

డిన్నర్‌ బ్రేక్‌ సమయంలో ‘ఫ్యాబ్‌ 5’ క్రికెటర్లు సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేలతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ పాల్గొనే ప్రత్యేక చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో చారిత్రాత్మక 2001 టెస్టు విశేషాల గురించి మాట్లాడతారు. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చన పలువురు క్రికెటేతర ఆటగాళ్లను కూడా ఘనంగా సన్మానించనున్నారు. ఈ జాబితాలో షూటర్‌ అభినవ్‌ బింద్రా, షట్లర్‌ పీవీ సింధు, చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, మేటి బాక్సర్‌ మేరీ కోమ్, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ పుల్లెల గోపీచంద్‌ తదితరులు ఉన్నారు. మ్యా చ్‌ తొలి నాలుగు రోజుల   టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.  ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు బంగ్లాదేశ్‌ నుంచి 5 వేల అభిమానులు రానున్నారు.

మరిన్ని వార్తలు