డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ వేదిక ఖరారు

9 Jun, 2016 19:54 IST|Sakshi

కోల్కతా: భారత్లో తొలిసారి జరిగే డే అండ్ నైట్ మ్యాచ్ వేదిక ఖారారైంది. ఈ ఏడాది చివర్లో  న్యూజిలాండ్-భారత జట్ల మధ్య జరిగే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్కు నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరిగే మూడు టెస్టు మ్యాచ్ల వేదికలను ఖరారు చేశారు. డే అండ్ నైట్ మ్యాచ్కు కోల్ కతా ఆతిథ్యం ఇస్తుంటే, మిగతా రెండు టెస్టు మ్యాచ్లను ఇండోర్, కాన్సూర్లలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ప్రకటించింది. 

 

దీనిలోభాగంగా ఈడెన్ లో  డే అండ్ నైట్ టెస్టు నిర్వహించేందుకు తాము రాసిన లేఖపై బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్లు  క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధికారి ఒకరు స్పష్టం చేశారు. న్యూజిలాండ్ తన భారత పర్యటనలో మూడు టెస్టు మ్యాచ్లతో పాటు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. రాబోవు 2016-17 వ సీజన్లో భారత్ మొత్తంగా 13 టెస్టు మ్యాచ్లతో పాటు, ఎనిమిది వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్లు ఆడనుంది. అయితే అంతకుముందు  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగే సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను డే అండ్ నైట్ నిర్వహించేందుకు ఇప్పటికే క్యాబ్ రంగం సిద్ధం చేసింది. జూన్ 17వ తేదీ నుంచి 20 వరకూ ఈ జరిగే సూపర్ లీగ్ డే అండ్ నైట్ టెస్టు ఫైనల్ ను నిర్వహించనున్నారు.  డే అండ్ నైట్ టెస్టు కోసం మొదటిసారిగా ‘కూకాబుర్రా’ పింక్ బంతులను ఉపయోగించనున్నారు.

మరిన్ని వార్తలు