మా ఇలవేణి బంగారం; ఈ పసిడి ప్రత్యేకం!

30 Aug, 2019 09:22 IST|Sakshi

రియో డి జెనిరో : భారత షూటర్‌ ఇలవేణి వలరివన్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకం సాధించింది. బుధవారం రియో డి జెనిరో వేదికగా జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె భారత్‌కు పతకాన్ని అందించింది. తద్వారా షూటింగ్‌ ప్రపంచ కప్‌ సిరీస్‌లో అంజలీ భగవత్‌, అపూర్వి చండేలా తర్వాత ఈ ఘనత సాధించిన(10 మీ ఎయిర్‌ రైఫిల్‌) మూడో మహిళా షూటర్‌గా నిలిచింది. ఈ నెల(ఆగస్టు 2)లోనే 20వ వసంతంలో అడుగుపెట్టిన ఈ కడలూరు అమ్మాయి సీనియర్‌ క్రీడాకారిణిగా బరిలో దిగిన రోజే పసిడిని సొంతం చేసుకోవడం విశేషం. కాగా బుధవారం నాడు జరిగిన పోటీలో 251.7 పాయింట్లు సాధించిన ఇలవేణి  ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక బ్రిటన్‌కు చెందిన సియోనాయిడ్‌ కింటోష్(250.6)‌, తైపీకి చెందిన లిన్‌ మాంగ్‌ చిన్‌(229.9) వరుసగా రజత, కాంస్య పతకాలతో ఇలవేణి తర్వాతి స్థానాల్లో నిలిచారు. 

కాగా సీనియర్‌ షూటర్‌, ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ వద్ద ఇలవేణి షూటింగ్‌లో మెళకువలు నేర్చుకుంది. విజయానంతరం ఆమె మాట్లాడుతూ..‘మ్యాచ్‌కు ముందు కాస్త ఒత్తిడికి లోనయ్యాను. ఒలింపిక్‌ పతకం సాధించాలని మూడేళ్ల కిందటే లక్ష్యం పెట్టుకున్నాను. ప్రస్తుతం ఈ విజయం నాలో విశ్వాసం నింపింది. మా అకాడమీ గన్‌ ఫర్‌ గ్లోరీకి జాతీయ అవార్డు వచ్చిన రోజే నేను పసిడి సాధించడం ఎంతో గర్వంగా ఉంది. ఈ స్వర్ణం నాకెంతో ప్రత్యేకమైనది’ అని సంతోషం వ్యక్తం చేసింది. తాను ఈ పతకం సాధించడం వెనుక ఎందరో ప్రోత్సాహం ఉందని, వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పతకాన్ని తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్టు పేర్కొంది. కాగా గత కొన్నేళ్లుగా దేశంలోని పలు నగరాల్లో షూటింగ్‌ కేంద్రాలను నెలకొల్పి..యువ షూటర్లకు శిక్షణ ఇస్తున్న గగన్‌ నారంగ్‌ సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ‘రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌’ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఇలవేణి వలరివన్‌..
కడలూరు జిల్లా తారామణికుప్పంకు చెందిన ఇలవేణి వలరివన్‌ కుటుంబం ఉద్యోగ రీత్యా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంటున్నది. తమిళనాట కడలూరు జిల్లాలోనే కాదు, చెన్నైలోనూ ఆ కుటుంబానికి ఆప్తులు ఎక్కువే. అందుకే తమిళనాడుతోనే ఆ కుటుంబానికి అనుబంధం ఎక్కువ. బ్యాచిలర్‌ ఇన్‌ ఆర్ట్స్‌ (ఇంగ్లిçషు) చదువుతున్న ఇలవేణికి రైఫిల్‌ షూటింగ్‌లో చిన్నతనం నుంచి మక్కువ ఎక్కువే. తండ్రి వలరివన్‌ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. జూనియర్‌ పోటీల్లో రాణించే ప్రయత్నం చేసింది. అనేకమార్లు వెనక్కి తగ్గినా, ఏ మాత్రం ఢీలా పడకుండా ముందుకు సాగిన ఇలవేణి ప్రస్తుతం తమిళనాట బంగారంతో మెరిసింది. బ్రిజిల్‌ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో తన సత్తాని ఇలవేణి చాటుకుంది. పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో 251.7 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని తమిళ ఖ్యాతిని బ్రెజిల్‌ వేదికగా చాటింది.

మా బంగారం ఇలవేణి..
తమ కుమార్తె పతకం సాధించడటం పట్ల వలరివన్‌ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని ఏదో ఒక క్రీడపై దృష్టి పెట్టే రీతిలో చర్యలు తీసుకోవాలని, అందులో వారిని ప్రోత్సహించాలని, సంపూర్ణ సహకారం అందించాలని ఇలవేణి తల్లిదండ్రులు సూచించారు. తన కుమార్తె ఒలింపిక్స్‌లో రాణించాలన్న లక్ష్యంతో ఉన్నదని అది సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, తారామణి కుప్పంవాసులు అయితే, తమ గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో ఇలవేణి నిలబెట్టినట్టు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అక్కడి యువత బాణసంచాలు పేల్చుతూ ఇలవేణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడి ఇలవేణి కుటుంబీకులు, అత్త, అవ్వ మా ఇలవేణి బంగారం అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా