అశ్విన్, జడేజాలకు మొండిచేయి

15 Oct, 2017 01:07 IST|Sakshi

లోకేశ్‌ రాహుల్‌కు దక్కని స్థానం

దినేశ్‌ కార్తీక్, శార్దుల్‌లకు పిలుపు

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

న్యూఢిల్లీ: సీనియర్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజాలకు సెలక్షన్‌ కమిటీ మళ్లీ మొండిచేయి చూపింది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు వారిద్దరిని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అశ్విన్‌ (తమిళనాడు), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో జట్టు సభ్యులైన బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్, పేస్‌ బౌలర్లు ఉమేశ్‌ యాదవ్, షమీలను కివీస్‌ సిరీస్‌ కోసం తప్పించారు. అయితే వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్, యువ పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌లకు జట్టులో స్థానం కల్పించారు.

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. తన భార్య అనారోగ్యం వల్ల అతను ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ ఆడలేదు. వెస్టిండీస్‌లో పర్యటించిన కార్తీక్‌ చివరి సారిగా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 32 ఏళ్ల ఈ వికెట్‌ కీపర్‌ ఆసీస్‌తో ముగిసిన టి20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ... ఆడే అవకాశం రాలేదు. ఈ నెల 22న ముంబైలో జరిగే తొలి వన్డేతో కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభమవుతుంది. 25న పుణేలో రెండో వన్డే, 29న కాన్పూర్‌లో మూడో వన్డే జరుగుతాయి.  

భారత వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధావన్, రహానే, మనీశ్‌ పాండే, జాదవ్, దినేశ్‌ కార్తీక్, ధోని, పాండ్యా, అక్షర్, కుల్దీప్‌ యాదవ్, చహల్, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్, శార్దుల్‌ ఠాకూర్‌.

మరిన్ని వార్తలు