పసిడి పోరుకు అర్హత

30 Apr, 2016 00:56 IST|Sakshi
పసిడి పోరుకు అర్హత

టీమ్ ఫైనల్లో భారత మహిళల జట్టు 
ప్రపంచకప్ ఆర్చరీ

 
షాంఘై (చైనా): వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన భారత మహిళా ఆర్చర్లు జట్టుగా మాత్రం రాణించారు. దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి మాఝీలతో కూడిన భారత జట్టు ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో రికర్వ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5-3తో టాప్ సీడ్ జర్మనీ జట్టును బోల్తా కొట్టించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 5-4తో చైనాపై గెలుపొందగా... తొలి రౌండ్‌లో 6-0తో అమెరికాను ఓడించింది.

ఆదివారం జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుతో దీపిక బృందం పోటీపడుతుంది. మరోవైపు పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో మంగళ్ సింగ్ చంపియా, అతాను దాస్, జయంత తాలుక్‌దార్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కోసం ఆడనుంది. సెమీఫైనల్లో భారత్ 4-5తో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగే కాంస్య పతక పోటీలో బ్రిటన్‌తో భారత్ తలపడుతుంది.

>
మరిన్ని వార్తలు