గుడ్‌బై నెహ్రాజీ...

2 Nov, 2017 00:35 IST|Sakshi

సాక్షి క్రీడావిభాగం  :కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఆశిష్‌ నెహ్రా అంటే కీలక సమయంలో పరుగులు ఇచ్చి భారత్‌కు విజయాన్ని దూరం చేయడం, తనకే సాధ్యమైన చెత్త ఫీల్డింగ్, వీటిపై ఇంటర్‌నెట్‌లో లెక్కలేనన్ని జోకులు... కానీ బుధవారం అతను సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్‌ ఆడి హీరోలా రిటైరయ్యాడు. తనపై గౌరవంగా ఈ మ్యాచ్‌ కోసం ఢిల్లీ క్రికెట్‌ సంఘం ఏర్పాటు చేసిన ‘ఆశిష్‌ నెహ్రా ఎండ్‌’ నుంచి బౌలింగ్‌ చేసే అదృష్టం దక్కించుకున్నాడు. గ్రౌండ్‌లో దూసుకొచ్చి నెహ్రా కాళ్లు మొక్కే అభిమాని కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయే ఘటన కూడా ఈ మ్యాచ్‌లో మనకు కనిపించింది! దిగ్గజాలు సెహ్వాగ్‌కు, వీవీఎస్‌ లక్ష్మణ్‌కు, జహీర్‌ ఖాన్‌లకు కూడా సాధ్యం కాని ‘వీడ్కోలు మ్యాచ్‌’ నెహ్రాకు లభించింది. ఇన్నేళ్ల కెరీర్‌లో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో పడగొట్టిన 235 వికెట్లే కాదు... మంచివాడుగా ఎందరినుంచో పొందిన అభిమానం కూడా అందుకు కారణం అంటే అతిశయోక్తి లేదు.
 
ఎప్పుడో కొత్త మిలీనియంకు ముందు నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్‌ ఎంతో మారింది. నెహ్రా స్వయంగా అజహర్‌తో మొదలు పెట్టి ఇంజమాముల్‌ హక్‌ (ఆసియా ఎలెవన్‌) నుంచి కోహ్లి వరకు ఏడుగురు కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడాడు. వేర్వేరు జట్లలో సభ్యుడిగా, తరాల అంతరాలకు వారధిగా నెహ్రా కొనసాగాడు. సుదీర్ఘ కెరీర్‌లో గాయాల పుస్తకంలో అన్ని పేజీలు చదివేసిన నెహ్రా ఇంత కాలం కొనసాగడం అతని పట్టుదలకు, ఆత్మ స్థైర్యానికి నిదర్శనం. ఎప్పుడూ ఇక నా పనైపోయిందనే ఆలోచన రాకుండా అతను సాగించిన ప్రయాణమే నెహ్రాను అనేక మంది కంటే భిన్నంగా, గొప్పగా నిలబెట్టింది. మధ్యలో సుదీర్ఘ విరామాలు రావడాన్ని పక్కన పెట్టి, ఓవరాల్‌గా తొలి మ్యాచ్‌కు, చివరి మ్యాచ్‌కు మధ్య కెరీర్‌ను చూస్తే 18 ఏళ్ల 250 రోజుల కెరీర్‌తో సుదీర్ఘకాలం ఆడిన భారత ఆటగాళ్లలో నెహ్రా నాలుగో స్థానంలో నిలుస్తాడు.  

నెహ్రా అరంగేట్రానికి కేవలం ఇద్దరు భారత లెఫ్టార్మ్‌ పేసర్లు మాత్రమే ఐదుకు మించి టెస్టు వికెట్లు పడగొట్టారు. అలాంటి సమయంలో నెహ్రా భిన్నమైన రనప్, యాక్షన్‌ కలగలిసిన తనదైన ప్రత్యేక శైలితో దూసుకొచ్చాడు. నెహ్రా అనగానే అందరికీ 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో 6/23 ప్రదర్శన మాత్రమే గుర్తుకొస్తుంది. అది మాత్రమే కాకుండా పాకిస్తాన్‌పై కరాచీ వన్డేలో, ఆ తర్వాత పాక్‌పైనే 2011 ప్రపంచ కప్‌ సెమీస్, గత ఏడాది టి20 ప్రపంచ కప్‌లో కుర్రాళ్లతో పోటీ పడి అతను చూపించిన ఆట కూడా నెహ్రా విలువేంటో చెబుతాయి. 36 ఏళ్ల వయసులో వృద్ధ సింహంలా టి20 క్రికెట్‌లోకి రావడం, 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం సాధారణ విషయం కాదు. ఐదేళ్ల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాక ‘ఇంత కాలం నా మొహం ఎవరికీ నచ్చలేదేమో’ అంటూ తనపైన జోకులు వేసుకోవడం...‘ఇప్పటికీ పాత నోకియా ఫోన్‌ను వాడుతున్న నన్ను సోషల్‌ మీడియా గురించి అడిగితే ఏం చెబుతాను’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినా అది నెహ్రాకే చెల్లింది. కెమెరా కళ్లకు నెహ్రా పెద్ద స్టార్‌ కాకపోవచ్చు, అతని గణాంకాలు మరీ గొప్పగా లేకపోవచ్చు గానీ... ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడగలిగిన, ఈతరం ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే క్రికెటర్‌గా మాత్రం నెహ్రా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. 

మరిన్ని వార్తలు