మదిలో ‘అడిలైడ్’ కదలాడుతుండగా...

30 Dec, 2014 01:31 IST|Sakshi

సాక్షి క్రీడావిభాగం: సిరీస్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 290/5... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 73 పరుగులు కలిపి చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. అయితే కోహ్లి, విజయ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి ప్రతిఘటనను ఆస్ట్రేలియా ఊహించలేదు. అందుకే ఇప్పుడు డిక్లరేషన్ గురించి ఆ జట్టు వెనుకాడుతోంది.

భారత బ్యాటింగ్ దూకుడు మీదుంది. కోహ్లి అయితే 350 అయినా ఛేదిస్తాం అంటూ అడక్కుండానే పదే పదే చెబుతున్నాడు. ఇది కచ్చితంగా వారిలో ఆందోళన రేకెత్తించింది. సాధారణంగా 300కు పైగా స్కోరు చివరి రోజు ఛేదించడం అంత సులభం కాదు. ఎంసీజీలో అయితే ఎప్పుడో 1929 తర్వాత ఏ జట్టూ ఇంత పెద్ద లక్ష్యాన్ని అందుకోలేదు. ఇలాంటి స్కోర్లు ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఆసీస్ కూడా సాహసంగా డిక్లేర్ చేసి ఫలితం కోసమే ప్రయత్నించింది తప్ప ‘డ్రా’ గురించి ఆలోచించలేదు.

‘అడిలైడ్‌లో వారి పోరాటం ఏమిటో చూశాం. అదృష్టం బాగుండి బయటపడ్డాం. లేదంటే కథ మరోలా ఉండేది. వారు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లేవారు. భారత్ ఇప్పుడు పాజిటివ్‌గా ఆడుతోంది. కాబట్టి ఇప్పుడున్న స్కోరుకు మేం మరికొన్ని పరుగులు జత చేయాల్సిందే’ అని వార్నర్ అంగీరించడం విశేషం. పిచ్ ఇప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం ఆసీస్‌ను ఆలోచింపజేసింది. ‘డ్రా’ అయినా సిరీస్ పోతుంది కాబట్టి టీమిండియా గెలుపు కోసం ప్రయత్నించవచ్చు.

ఆసీస్ వ్యూహాన్ని చూస్తే  చివరి రోజు ఆ జట్టు కొన్ని పరుగులు జోడించడంతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అందుబాటులో ఉన్న సమయంలో ఎంత ధాటిగా ఆడినా లక్ష్య ఛేదన భారత్‌కు కష్టమైపోతుంది. ఈ క్రమంలో వికెట్లు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అది ఆసీస్‌కే అనుకూలం. మంగళవారం కూడా వర్షం వచ్చి అంతరాయం ఏర్పడితే మ్యాచ్ ‘డ్రా’ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిరీస్ విజయంపై దృష్టి పెట్టిన స్మిత్ సేన ఈ టెస్టు వరకు తమ దూకుడును తీసి గట్టున పెట్టినట్లే!
 
‘వేడి’ కొనసాగింది...
నాలుగో రోజు కూడా కోహ్లి, జాన్సన్ మధ్య మాటల యుద్ధం సాగింది. షమీ బౌలింగ్‌లో అవుటై జాన్సన్ వెళుతుండగా కోహ్లి అతడిని ఏదో అన్నాడు. దానిని జాన్సన్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. వెంటనే ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు కలుగజేసుకొని కోహ్లికి సర్ది చెప్పారు. మరోవైపు హాడిన్ క్రీజ్‌లో ఉన్న సమయంలో చాలా సేపు అతనికి దాదాపు ఆనుకున్నంత దూరంలో నిలబడి కోహ్లి పదే పదే నోటికి పని చెప్పాడు.

మరిన్ని వార్తలు