ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌

9 Jan, 2020 11:03 IST|Sakshi

నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్‌ జేమ్స్‌ అండర్స్‌న్‌ పక్కటెముకల గాయం కారణంగా మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. ‘ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మిగతా టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు’అంటూ ఈసీబీ ట్వీట్‌ చేసింది. రెండో టెస్టు సందర్భంగా అండ్సన్‌ కాస్త ఇబ్బంది పడ్డాడని, మ్యాచ్‌ అనంతరం ఎమ్మారై స్కాన్‌ తీయించగా అతడి పక్కటెముకల్లో చిన్న పగుళు ఏర్పడినట్లు డాక్టర్లు చెప్పారని ఈసీబీ తెలిపింది. అంతేకాకుండా అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో అతడిని మిగతా టెస్టులకు దూరమవుతున్నాడని పేర్కొంది. అయితే ఆ గాయం తీవ్రత, ఎంతకాలం విశ్రాంతి అనే దానిపై స్పష్టత రావాల్సివుంది. 

ఇక ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహిస్తున్న జిమ్మీ మిగతా టెస్టులకు దూరమవడం ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్టులో ఓటమి అనంతరం రెండో టెస్టులో అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లీష్‌ జట్టు ప్రొటీస్‌ జట్టుపై ఘనవిజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో మూడో టెస్టు కూడా గెలిచేసి సిరీస్‌పై భరోసాగా ఉండాలనే ఆలోచనలో ఉంది. ఇలాంటి తరుణంలో జిమ్మీ దూరమవడం ఆ జట్టును కలవరానికి గురిచేస్తోంది. దక్షిణాఫ్రికా అంటేనే ఫాస్ట్‌ పిచ్‌లకు స్వర్గధామం. ఇలాంటి తరుణంలో ప్రధాన బౌలర్‌ గైర్హాజరిలో మిగతా బౌలర్లతో ఇంగ్లండ్‌ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. ఇక కేప్‌టౌన్‌లో టెస్టులో ఘోర ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా ఆత్మవిమర్శ చేసుకుంటోంది. గత మ్యాచ్‌ తప్పిదాలను మరలా పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఆడాలని డుప్లెసిస్‌ సేన భావిస్తోంది.  

మరిన్ని వార్తలు