అదరహొల్డర్

10 Jul, 2020 02:08 IST|Sakshi

6 వికెట్లతో చెలరేగిన విండీస్‌ కెప్టెన్‌

ఇంగ్లండ్‌ 204 ఆలౌట్‌  – విండీస్‌ 57/1 

తొలిరోజు వర్షం అడ్డుకుంది. కానీ రెండో రోజు వెస్టిండీస్‌ ఓ ఆటాడుకుంది. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. కరీబియన్‌ బౌలర్లు ఎవరినీ క్రీజులో నిలువనీయలేదు. హోల్డర్, గాబ్రియెల్‌ల పేస్‌ ద్వయం క్రమం తప్పకుండా వికెట్లను పడగొట్టేసింది. కోవిడ్‌తో చాన్నాళ్ల తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ సొంతగడ్డపైనే పరుగులు చేసేందుకు ఇంత కష్టపడుతుందని, క్రీజులో నిలిచేందుకు ఇన్ని పాట్లు పడుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

సౌతాంప్టన్‌: విండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ (6/42) పేస్‌కు ఇంగ్లండ్‌ విలవిల్లాడింది. అతనికి తోడుగా షెనాన్‌ గాబ్రియెల్‌ (4/62) సత్తా చాటడంతో ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ స్టోక్స్‌ (43; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... బట్లర్‌ (35; 6 ఫోర్లు), డామ్‌ బెస్‌ (31 నాటౌట్‌; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి 19.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (20 బ్యాటింగ్‌), షై హోప్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. క్యాంప్‌బెల్‌ (28; 3 ఫోర్లు)ను అండర్సన్‌ ఔట్‌ చేశాడు. రెండో రోజు కూడా వర్షం అంతరాయం కలిగించినా చివరకు 69.2 ఓవర్ల ఆట సాగడం కొంత ఊరట.

డెన్లీతో పతనం షురూ 
ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్‌కు ఆటుపోట్లు మొదలయ్యాయి. గురువారం 35/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ స్వల్ప వ్యవధిలోనే టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. గాబ్రియెల్‌ నిప్పులు చెరిగాడు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ డెన్లీ (18; 4 ఫోర్లు), రోరీ బర్న్స్‌ (30; 4 ఫోర్లు)లను తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లండ్‌ 51 పరుగులకే టాప్‌–3 వికెట్లను చేజార్చుకుంది. దీంతో ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను కెప్టెన్‌ స్టోక్స్‌ తన భుజాన వేసుకోగా... కూల్చేసే పనిని ప్రత్యర్థి కెప్టెన్‌ హోల్డర్‌ చేపట్టాడు. ఏమాత్రం కుదురుకునే అవకాశమివ్వకుండా... జాక్‌ క్రాలీ (10; 2 ఫోర్లు)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే ఒలీ పోప్‌ (12; 2 ఫోర్లు)ను కీపర్‌ క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. ఇంగ్లండ్‌ స్కోరు 87/5. ఇంకా తొలిసెషన్‌ ముగియకముందే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అందరిన్నీ పొగొట్టుకుంది. వంద పరుగులు దాటాకా జట్టు స్కోరు 106/5 వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్లోనే ఆలౌట్‌ 
సెషన్‌ మారినా ఇంగ్లండ్‌ ఆటతీరేం మారలేదు. అలాగే హోల్డర్‌ జోరూ తగ్గలేదు. కెప్టెన్‌ స్టోక్స్, బట్లర్‌తో కలిసి వికెట్ల పతనానికి కాస్త అడ్డుకట్టవేసినా... పట్టు చిక్కించుకునేందుకు హోల్డర్‌కు ఎంతోసేపు పట్టలేదు. ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించాక... వాళ్లిద్దరితో పాటు ఆర్చర్‌(0)ను 3 పరుగుల వ్యవధిలోనే అతను పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత జట్టు స్కోరును బెస్‌ 200 పరుగులు దాటించగలిగాడు.  అండర్సన్‌(10)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన గాబ్రియెల్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రెండో రోజు ఆటలో అంపైర్ల నిర్ణయాలు పేలవం. ఆరుసార్లు రివ్యూకు వెళ్లగా ఇందులో ఐదుసార్లు బౌలర్లకే అనుకూల ఫలితాలొచ్చాయి. ఒక్కసారి మాత్రమే అంపైర్‌ నిర్ణయం సరైందిగా తేలింది.

సంక్షిప్త స్కోర్లు 
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 204 (స్టోక్స్‌ 43, బట్లర్‌ 35, బెస్‌ 31నాటౌట్‌; హోల్డర్‌ 6/42, గాబ్రియెల్‌ 4/62). 
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 57/1 (బ్రాత్‌వైట్‌ బ్యాటింగ్‌ 20; క్యాంప్‌బెల్‌ 28)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా