యాషెస్‌ సమరానికి సై..

1 Aug, 2019 02:35 IST|Sakshi

నేటి నుంచి చిరకాల ప్రత్యర్థుల చారిత్రక పోరు

తొలి టెస్టుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిద్ధం

సొంతగడ్డపై పటిష్టంగా రూట్‌ సేన

సిరీస్‌ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆసీస్‌

సమరంలో సమ ఉజ్జీలు అంటే ఎలా ఉండాలి. ప్రతిష్టాత్మక యాషెస్‌ పోరులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల తరహాలో ఉండాలి. 70 సిరీస్‌లు జరిగితే ఒక జట్టు 33 సిరీస్‌లు గెలిస్తే, మరో జట్టు 32 సార్లు సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. కేవలం ఐదు సిరీస్‌లు మాత్రమే సమంగా ముగిశాయంటే పోటీ తీవ్రత ఏమిటో తెలుస్తుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో ఇది ఒక క్రికెట్‌ సిరీస్‌ మాత్రమే కాదు. కెరీర్‌లను మార్చేయగల అవకాశం. యాషెస్‌ను గెలిపించి జీవితకాలం హీరోలుగా మారిపోయినవారు, యాషెస్‌లో విఫలమై ఎప్పటికీ ఆ మచ్చను చెరుపుకోలేక అంతర్ధానమైపోయినవారు ఇరు జట్లలోనూ కోకొల్లలుగా కనిపిస్తారు. ధనాధన్‌ క్రికెట్‌ జమానాలో కూడా టెస్టులకు ఊపిరి పోస్తున్న హోరాహోరీ సమరానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మొదలై సెప్టెంబర్‌ 16న ముగిసే యాషెస్‌ సమరంలో తుది విజేత ఎవరో?

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత క్రికెట్‌ అభిమానులకు కనువిందు చేసే మరో పోరు ఇంగ్లండ్‌ గడ్డపైనే జరగబోతోంది. 137 ఏళ్ల చరిత్ర గల యాషెస్‌ సిరీస్‌కు నగారా మోగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో   నేటి నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతుంది. 2017–18 సీజన్‌లో ఆసీస్‌ గడ్డపై జరిగిన యాషెస్‌ను ఆస్ట్రేలియా 4–0తో సొం తం చేసుకుంది. అంతకుముందు (2015లో) స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న ఇంగ్లండ్‌ మళ్లీ దానిని సాధించాలని పట్టుదలగా ఉంది. బలాబలాలపరంగా ఇంగ్లండ్‌ పటిష్టంగా కనిపిస్తుండగా... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆసీస్‌ గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది. 2001 తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో ఏ ఫార్మాట్‌లో కూడా ఇంగ్లండ్‌ ఓడలేదు. మరోవైపు తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది.  

ఆర్చర్‌ ఔట్‌! 
వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత ఇంగ్లండ్‌ దేశంలో ఆ జట్టుపై భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడిన జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఇప్పుడు యాషెస్‌ తొలి టెస్టు బరిలో ఉండగా, స్వదేశంలో రూట్‌ తొలిసారి యాషెస్‌ సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తమ తుది జట్టును ప్రకటించింది. ఇందులో పేస్‌ బౌలర్‌ ఆర్చర్‌కు చోటు దక్కలేదు. సీనియర్‌ బౌలర్లు, టెస్టుల్లో అత్యధిక వికెట్ల జాబితాలో టాప్‌–10లో ఉన్న అండర్సన్, బ్రాడ్‌లపైనే కీలక బాధ్యత ఉంచింది. వీరిద్దరు స్వదేశంలోని అనుకూల వాతావరణంలో చెలరేగితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. ఐర్లాండ్‌తో టెస్టులో రాణించిన క్రిస్‌ వోక్స్‌ మూడో పేసర్‌గా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

కొంతకాలంగా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నా... మొయిన్‌ అలీ స్పిన్‌పై ఇంగ్లండ్‌ నమ్మకముంచింది. ఓపెనర్లు బర్న్స్, జేసన్‌ రాయ్‌లతో పాటు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ డెన్లీ తొలిసారి యాషెస్‌ ఆడుతున్నారు. రూట్, బెయిర్‌స్టో, బట్లర్‌లతో జట్టు బ్యాటింగ్‌ మెరుగ్గా కనిపిస్తోంది. సిరీస్‌ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చగల ఆటగాడిగా అందరి దృష్టి బెన్‌ స్టోక్స్‌పైనే ఉంది. నైట్‌క్లబ్‌ దాడి కేసులో విచారణ కారణంగా స్టోక్స్‌ గత యాషెస్‌కు దూరమయ్యాడు. ప్రపంచకప్‌ తర్వాత హీరోగా మారిన అతను ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లోనూ సత్తా చాటితే ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిపోవడం ఖాయం. సరిగ్గా చెప్పాలంటే ఆసీస్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటే అందుకు స్టోక్స్‌ కారణం. అయితే ఐర్లాండ్‌తో టెస్టులో బయటపడ్డ బ్యాటింగ్‌ బలహీనతను ఇంగ్లండ్‌ అధిగమించాల్సి ఉంది.  

స్టార్క్‌పై వేటు! 
సొంతగడ్డపై గత యాషెస్‌ సిరీస్‌ (2017–18) విజయంతో సంబరాలు చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత చావుదెబ్బ తింది. దక్షిణాఫ్రికాతో 1–3తో సిరీస్‌ ఓడిపోవడంతో పాటు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి పరువు కోల్పోయింది. ఆ తర్వాత పాక్‌పై 1–0తో సిరీస్‌ నెగ్గినా, భారత్‌ చేతిలో తొలిసారి సిరీస్‌ ఓడి చెత్త రికార్డును నమోదు చేసింది. బలహీన శ్రీలంకపై నెగ్గినా అది చెప్పుకోదగ్గ విజయం కాదు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ నిజంగా తమ ప్రతిష్ట పెంచుకునేందుకు యాషెస్‌ అవకాశం కల్పిస్తోంది. ఆటగాళ్ల ఫామ్, ప్రత్యర్థిని బట్టి చూస్తే అది అంత సులువు కాదు. వాస్తవంగా చెప్పాలంటే కంగారూలు సిరీస్‌ను ‘డ్రా’గా ముగించి యాషెస్‌ నిలబెట్టుకుంటే పెద్ద ఘనతే అవుతుంది.

వరల్డ్‌ కప్‌ ఆడిన స్మిత్, వార్నర్‌లతో పాటు నిషేధం ముగిసిన తర్వాత బాన్‌క్రాఫ్ట్‌ తొలిసారి టెస్టు బరిలో దిగుతున్నాడు. మైదానంలో ఈ ముగ్గురికి ఇంగ్లండ్‌ అభిమానుల హేళనలు తప్పవు! గత యాషెస్‌లో అత్యద్భుతంగా ఆడిన స్మిత్‌నుంచి ఆసీస్‌ ఎంతో ఆశిస్తున్నా వరల్డ్‌కప్‌లో అతని ఆట చూస్తే పాత స్మిత్‌లాగా కనిపించడం లేదు. వార్నర్‌ కూడా ఒత్తిడిని అధిగమించి చెలరేగాల్సి ఉంది. ఓపికతో పాటు నిలకడగా ఆడే ఖాజా జట్టు బలం కాగా, మిడిలార్డర్‌లో హెడ్, వేడ్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాల్సి ఉంది. వీరిద్దరు తొలిసారి యాషెస్‌ బరిలోకి దిగుతున్నారు. 17 మంది సభ్యుల బృందంలో ఏకంగా ఆరుగురు పేస్‌ బౌలర్లను తీసుకున్న ఆసీస్‌ తొలి టెస్టులో మాత్రం సీనియర్‌ మిషెల్‌ స్టార్క్‌ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. టెస్టుల్లో అతని ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడంతో ప్యాటిన్సన్‌ తుది జట్టులో ఆడటం ఖాయమైంది.  చాలా కాలం తర్వాత వస్తున్న ప్యాటిన్సన్‌... కమిన్స్‌ తోడుగా చెలరేగితే ఆసీస్‌ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు.

యాషెస్‌ చరిత్ర గణాంకాల్లో... 
1882 నుంచి 2018 వరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య 330 టెస్టులు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 134 గెలవగా, ఇంగ్లండ్‌ 106 గెలుచుకుంది. మరో 90 టెస్టులు డ్రాగా ముగిశాయి. యాషెస్‌లో మొత్తం ఐదు ట్రిపుల్‌ సెంచరీలు నమోదయ్యాయి. వీటిలో బ్రాడ్‌మన్‌ రెండు (334, 304) చేయగా, బాబ్‌ సింప్సన్‌ (311), బాబ్‌ కౌపర్‌ (307) ఒక్కోటి చేశారు. ఇంగ్లండ్‌ తరఫున ఏకైక ట్రిపుల్‌ సెంచరీ చేసిన లెన్‌ హటన్‌ (364)దే యాషెస్‌లో అత్యధిక స్కోరు
అత్యధిక స్కోరు: ఇంగ్లండ్‌ 903/7 డిక్లేర్డ్‌ (1938లో)  
అత్యల్ప స్కోరు: ఆస్ట్రేలియా 36 ఆలౌట్‌ (1902లో) 
అత్యధిక పరుగులు/సెంచరీలు: బ్రాడ్‌మన్‌ (37 టెస్టుల్లో 5028/ 19 సెంచరీలు)  
అత్యధిక వికెట్లు: షేన్‌ వార్న్‌ (36 టెస్టుల్లో 195 వికెట్లు) 
అత్యుత్తమ బౌలింగ్‌: ఇన్నింగ్స్‌లో జిమ్‌ లేకర్‌ (10/53), మ్యాచ్‌లో జిమ్‌ లేకర్‌ (19/90; 1956 మాంచెస్టర్‌ టెస్టులో)  అత్యధిక మ్యాచ్‌లు: సిడ్నీ గ్రెగరీ (52) 
కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: అలెన్‌ బోర్డర్‌ (28)

తుది జట్లు
ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), బర్న్స్, రాయ్, డెన్లీ, బట్లర్, స్టోక్స్, బెయిర్‌స్టో, అలీ, వోక్స్, బ్రాడ్, అండర్సన్‌. 
ఆస్ట్రేలియా (అంచనా): పైన్‌ (కెప్టెన్‌), వార్నర్, బాన్‌క్రాఫ్ట్, ఖాజా, స్మిత్, హెడ్‌/ మిషెల్‌ మార్ష్‌,  వేడ్, కమిన్స్, ప్యాటిన్సన్, లయన్, సిడిల్‌/ హాజల్‌వుడ్‌.              

మరిన్ని వార్తలు