మోర్గాన్‌ సిక్సర్ల మోత

19 Jun, 2019 04:52 IST|Sakshi
బెయిర్‌స్టో, రూట్‌

17 సిక్సర్లతో ప్రపంచ రికార్డు

71 బంతుల్లో 148 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌

150 పరుగులతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

బెయిర్‌స్టో, రూట్‌ సెంచరీలు మిస్‌

ఇంగ్లండ్‌ అభిమానులు ప్రపంచ కప్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇన్నింగ్స్‌ రానే వచ్చింది. సింగిల్‌ తీసినంత ఈజీగా సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఒక్కసారిగా కప్‌కు ఊపు తెచ్చేశాడు. అతని దెబ్బకు అఫ్గాన్‌ ఆటగాళ్లు అసలైన పసికూనల్లా కనిపించారు. ఒకటి, రెండు, మూడు... ఇలా బ్యాట్‌కు తగిలిన వెంటనే అలా బంతి గాల్లో తేలిపోతూ స్టాండ్స్‌లోకి పడుతుంటే వారంతా ప్రేక్షకుల్లా నివ్వెరపోయి చూస్తుండటం మినహా ఏమీ చేయలేకపోయారు.

ఎలా బంతి వేసినా అది చివరకు సిక్సర్‌గా మారాల్సిందే అన్నంత కసిగా మోర్గాన్‌ బాదడంతో మాంచెస్టర్‌ మైదానంలో పరుగుల పండగ సాగింది. చివరకు మోర్గాన్‌ లెక్క భారీ సెంచరీ సహా 17 సిక్సర్ల ప్రపంచ రికార్డు వద్ద ఆగింది... ఒక్క సిక్సర్లతోనే వంద పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన తమ కెప్టెన్‌కు తోడుగా బెయిర్‌స్టో, రూట్‌ కూడా రాణించడంతో ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఊహించినట్లుగానే అఫ్గానిస్తాన్‌ లక్ష్యానికి అందనంత దూరంలో నిలిచిపోయి మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
   
మాంచెస్టర్‌: రికార్డుల మోత మోగిన మ్యాచ్‌లో ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడి ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో జరిగిన పోరులో ఇంగ్లండ్‌ 150 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇయాన్‌ మోర్గాన్‌ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేయగా... బెయిర్‌స్టో (99 బంతుల్లో 90; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్‌ (82 బంతుల్లో 88; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆ అవకాశం చేజార్చుకున్నారు. అనంతరం అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (100 బంతుల్లో 76; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలతో సెమీస్‌ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా అఫ్గానిస్తాన్‌ ఖాయమైంది.  

రెండు సెంచరీలు చేజారె...
ఇంగ్లండ్‌కు బెయిర్‌స్టో మరోసారి శుభారంభం అందించాడు. రాయ్‌ గాయపడటంతో జట్టులోకి వచ్చిన విన్స్‌ (26) పెద్దగా రాణించకపోయినా... 120 పరుగుల బెయిర్‌స్టో, రూట్‌ రెండో వికెట్‌ భాగస్వామ్యం ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాటలు వేసింది. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేస్తూ అఫ్గాన్‌ బౌలర్లు అందరిపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో 61 బంతుల్లో బెయిర్‌స్టో, 54 బంతుల్లో జో రూట్‌ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. పార్ట్‌నర్‌షిప్‌ 100 పరుగులు దాటిన తర్వాత సెంచరీకి చేరువైన దశలో నైబ్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి బెయిర్‌స్టో నిష్క్రమించాడు.

అనంతరం మోర్గాన్‌ మెరుపుల ముందు చాలా సేపు రూట్‌ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. 189 పరుగుల మోర్గాన్, రూట్‌ మూడో వికెట్‌ భాగస్వామ్యంలో మోర్గాన్‌ కొట్టినవి 142 పరుగులు కాగా, రూట్‌ 43 పరుగులు చేశాడు. చివరకు నైబ్‌ బౌలింగ్‌లోనే భారీ షాట్‌ ఆడబోయి లాంగాన్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో ఈ టోర్నీలో రూట్‌ మూడో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. వీరిద్దరు ఔటైన తర్వాత చివర్లో మొయిన్‌ అలీ (9 బంతుల్లో 31 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్సర్లు) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్‌ 400 పరుగులకు చేరువగా వచ్చింది. ఆఖరి 2 ఓవర్లలో అలీ రెండేసి సిక్సర్లు బాదాడు. చివరి పది ఓవర్లలో ఇంగ్లండ్‌ 142 పరుగులు సాధించింది.  

హష్మతుల్లా మినహా...
దాదాపు అసాధ్యమైన లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ ఏ దశలోనూ గట్టిగా నిలబడలేకపోయింది. రెండో ఓవర్లోనే నూర్‌ అలీ (0) ఔట్‌ కావడంతో సరైన ఆరంభమే లభించలేదు. కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ (28 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా, రహ్మత్‌ షా (74 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఆ తర్వాత హష్మతుల్లా, అస్గర్‌ (48 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 90 బంతుల్లోనే 94 పరుగులు జోడించి కొద్దిగా ప్రతిఘటించే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. నబీ (9) కూడా విఫలం కావడంతో విజయంపై అఫ్గాన్‌ ఆశలు కోల్పోయింది.

‘కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి’
ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోర్గాన్‌ను నీకిష్టమైన షాట్‌ ఏదని అడిగితే... ‘సిక్సర్‌ కొట్టగలిగే ఏ షాట్‌ అయినా నాకిష్టమే’ అని చెప్పాడు! ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో (211 సిక్సర్లు) ఉన్న మోర్గాన్‌ విషయంలో ఆ వ్యాఖ్య అతిశయోక్తిగా అనిపించదు. అతని సిక్సర్ల సునామీ అఫ్గాన్‌ మ్యాచ్‌లో మరోసారి కనిపించింది. డీప్‌ మిడ్‌వికెట్, లాంగాన్, లాంగాఫ్, డీప్‌ స్క్వేర్‌లెగ్, మిడాఫ్‌... ఇలా ఏ వైపు అంటే ఆ వైపు, ఎలా అనుకుంటే అలా మోర్గాన్‌ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.

అతని దెబ్బకు పాపం అఫ్గాన్‌ బౌలర్లంతా బెంబేలెత్తిపోయారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ లెగ్‌స్పిన్నర్‌గా ప్రశంసలందుకుంటున్న రషీద్‌ ఖాన్‌ అయితే బంతి ఎలా వేయాలో తెలీక పూర్తిగా చేతులెత్తేశాడు. 30వ ఓవర్‌ చివరి బంతికి మోర్గాన్‌ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి రూట్‌ 45 పరుగుల వద్ద ఆడుతున్నాడు. సరిగ్గా 40 ఓవర్లు ముగిసే సరికి రూట్‌ స్కోరు 66 కాగా, మోర్గాన్‌ 67 వద్ద నిలవడం విశేషం! నైబ్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో మోర్గాన్‌ జోరు మొదలైంది. ఆ తర్వాత రషీద్‌ ఓవర్లో 2 సిక్సర్లు, మరో ఫోర్‌తో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ చెలరేగాడు.

అదే ఓవర్లో 28 పరుగుల వద్ద మోర్గాన్‌ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ వద్ద సునాయాసంగా అందుకోవాల్సిన క్యాచ్‌ను దౌలత్‌ పొరపాటుగా అంచనా వేయడంతో అఫ్గాన్‌ సువర్ణావకాశం కోల్పోయింది. నబీ బౌలింగ్‌లో సిక్స్‌తోనే 36 బంతుల్లో మోర్గాన్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత చెలరేగిపోయిన ఇయాన్‌ తర్వాతి 21 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ క్రమంలో రషీద్‌ ఖాన్‌ మళ్లీ బాధితుడయ్యాడు. అతను వేసిన 43వ ఓవర్లో మోర్గాన్‌ మూడు సిక్సర్లు బాది ప్రపంచకప్‌లో నాలుగో వేగవంతమైన శతకం (57 బంతుల్లో) నమోదు చేశాడు.

రషీద్‌ తర్వాతి ఓవర్లో కూడా రీప్లే చూపిస్తూ మళ్లీ 3 భారీ సిక్సర్లతో విరుచుకుపడిన మోర్గాన్‌... నైబ్‌ ఓవర్లో కూడా మళ్లీ మూడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సిక్సర్లతోనే సెంచరీ సాధించిన మోర్గాన్‌ ఇన్నింగ్‌లో అలా ఉండీ లేనట్లు నాలుగు ఫోర్లు మాత్రం ఉన్నాయి. 17వ సిక్సర్‌ కొట్టగానే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో షాకు క్యాచ్‌ ఇవ్వడంతో అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. నాలుగు రోజుల క్రితం వెన్నునొప్పితో బాధపడుతూ మీడియా సమావేశంలో నిలబడి మాట్లాడిన మోర్గాన్‌ ఒక దశలో ఈ మ్యాచ్‌ ఆడటం కూడా సందేహంగానే మారింది. కానీ అతను ఆడటమే కాదు అదరగొట్టాడు.   

9 ఓవర్లలో 110 పరుగులు...
ప్రపంచవ్యాప్తంగా టి20 క్రికెట్‌లో స్టార్‌ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకొని అఫ్గాన్‌ జట్టు ఆశలు మోస్తున్న లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు ఈ మ్యాచ్‌లో భారీ దెబ్బ పడింది. మోర్గాన్‌ దెబ్బకు ఎవరూ ఆశించని చెత్త రికార్డులు అతని ఖాతాలో చేరాయి. ఒక ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు (110) ఇచ్చిన బౌలర్‌గా వహాబ్‌ రియాజ్‌ (110)తో సమంగా నిలిచిన రషీద్, వన్డేల్లో 100కు పైగా పరుగులు ఇచ్చిన తొలి స్పిన్నర్‌. ఓవరాల్‌గా వన్డేల్లో మిక్‌ లూయీస్‌ (113) తర్వాత ఇది రెండో చెత్త ప్రదర్శన. కాగా... ఎకానమీ (9 ఓవర్లలోనే 110 పరుగులు ఇవ్వడం; ఓవర్‌కు 12.22 పరుగులు) పరంగా చూస్తే దీనికే అగ్రస్థానం దక్కుతుంది. రషీద్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ ఒక్కడే 7 సిక్సర్లు బాదగా... మొత్తంగా 11 సిక్స్‌లతో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా ఎవరూ కోరుకోని గుర్తింపు పొందాడు.  

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: విన్స్‌ (సి) ముజీబ్‌ (బి) దౌలత్‌ 26; బెయిర్‌స్టో (సి అండ్‌ బి) నైబ్‌ 90; రూట్‌ (సి) రహ్మత్‌ షా (బి) నైబ్‌ 88; మోర్గాన్‌ (సి) రహ్మత్‌షా (బి) నైబ్‌ 148; బట్లర్‌ (సి) నబీ (బి) దౌలత్‌ 2; స్టోక్స్‌ (బి) దౌలత్‌ 2; మొయిన్‌ అలీ (నాటౌట్‌) 31; వోక్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9;
మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 397.

వికెట్ల పతనం: 1–44, 2–164, 3–353, 4–359, 5–362, 6–378. 

బౌలింగ్‌: ముజీబ్‌ 10–0–44–0, దౌలత్‌ 10–0–85–3, నబీ 9–0–70–0, గుల్బదిన్‌ నైబ్‌ 10–0–68–3, రహ్మత్‌ షా 2–0–19–0, రషీద్‌ ఖాన్‌ 9–0–110–0.

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: నూర్‌ అలీ (బి) ఆర్చర్‌ 0; నైబ్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 37; రహ్మత్‌ షా (సి) బెయిర్‌స్టో (బి) ఆదిల్‌ రషీద్‌ 46; హష్మతుల్లా (బి) ఆర్చర్‌ 76; అస్గర్‌ (సి) రూట్‌ (బి) ఆదిల్‌ రషీద్‌ 44; నబీ (సి) స్టోక్స్‌ (బి) ఆదిల్‌ రషీద్‌ 9; నజీబుల్లా (బి) వుడ్‌ 15; రషీద్‌ ఖాన్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఆర్చర్‌ 8; ఇక్రమ్‌ (నాటౌట్‌) 3; దౌలత్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9;
మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 247.

వికెట్ల పతనం: 1–4, 2–52, 3–104, 4–198, 5–210, 6–234, 7–234, 8–247.

బౌలింగ్‌: వోక్స్‌ 9–0–41–0, ఆర్చర్‌ 10–1–52–3, మొయిన్‌ అలీ 7–0–35–0, వుడ్‌ 10–1–40–2, స్టోక్స్‌ 4–0–12–0, ఆదిల్‌ రషీద్‌ 10–0–66–3.   

1: వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (17) కొట్టిన ఆటగాడు మోర్గాన్‌. గతంలో రోహిత్, డివిలియర్స్, గేల్‌ 16 చొప్పున సిక్సర్లు బాదారు.  

1: ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన జట్టు (25)గా ఇంగ్లండ్‌ నిలిచింది.  

1: ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ తమ అత్యధిక స్కోరు (397) నమోదు చేసింది.  

ప్రపంచకప్‌లో నేడు
దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్‌
వేదిక: బర్మింగ్‌హామ్‌
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు