ఇంగ్లండ్‌ ఇరవై ఏడేళ్లకు...

12 Jul, 2019 04:32 IST|Sakshi

ప్రపంచ కప్‌ ఫైనల్లో మోర్గాన్‌ సేన

సెమీఫైనల్లో ఆసీస్‌పై 8 వికెట్లతో ఘన విజయం

1992 తర్వాత తొలిసారి తుది పోరుకు ఇంగ్లండ్‌

జేసన్‌ రాయ్‌ మెరుపు బ్యాటింగ్‌

చెలరేగిన వోక్స్, ఆర్చర్‌ 

ఆదివారం కివీస్‌తో పోరు

9969 రోజులు... ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఆఖరిసారిగా ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఆడి ఇన్నిరోజులైంది! అప్పటి నుంచి ఆ దేశపు అభిమానులు ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. 1992 వరల్డ్‌ కప్‌ తర్వాత ఆరు టోర్నీలలో ఒక్కసారి కూడా సెమీస్‌ చేరలేకపోయిన ఇంగ్లండ్‌ ఇప్పుడు సొంతగడ్డపై ఎట్టకేలకు తుదిపోరుకు అర్హత సాధించింది. గతంలో మూడు ఫైనల్‌ పోరాటాల్లోనూ ఓడిన ఆ జట్టు నాలుగో సారి ఫైనల్లోకి అడుగుపెట్టి 44 ఏళ్ల తమ టైటిల్‌ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే నిష్క్రమించి పాతాళానికి పడిపోయిన ఇంగ్లండ్‌ కొత్తగా ఎగసి ఇప్పుడు డిఫెండింగ్‌ చాంపియన్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియానే చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టడం మరో విశేషం.

బర్మింగ్‌హామ్‌: సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఖేల్‌ ఖతమైంది. ఈ ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్‌ ఖాయమైంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై జయకేతనం ఎగురవేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మిత్‌ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిస్‌ వోక్స్‌ ప్రత్యర్థిని దెబ్బతీశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేసన్‌ రా య్‌ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్‌ (39 బంతుల్లో 45 నాటౌట్‌), రూట్‌ (46 బంతుల్లో 49 నాటౌట్‌; 8 ఫోర్లు) రాణించారు.

ఫించ్‌ 0... 14కే ముగ్గురు ఔట్‌
టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకోగా, వార్నర్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన కెప్టెన్‌ ఫించ్‌ (0) డకౌటయ్యాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి బంతికే  ఆర్చర్‌ అతన్ని ఔట్‌ చేశాడు. మరుసటి ఓవర్లోనే వార్నర్‌ (9)ను పెవిలియన్‌ చేర్చిన వోక్స్,  హ్యాండ్స్‌కోంబ్‌ (4)ను బౌల్డ్‌ చేశాడు. 6.1 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు 14/3. పట్టుమని పది ఓవర్ల ‘పవర్‌ప్లే’  పూర్తికాకముందే టాపార్డర్‌ వికెట్లను కోల్పోయిన కంగారూ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆఖరి దాకా స్మిత్‌ ఒక్కడే...
రెండో ఓవర్‌ రెండో బంతికే స్మిత్‌ ఆట మొదలైంది. అక్కడి నుంచి 47.1 ఓవర్‌ దాకా స్మిత్‌ జట్టును ఒడ్డున పడేసేందుకు చేసిన పోరాటం అద్వితీయం. హ్యాండ్స్‌కోంబ్‌ నిష్క్రమించాక వచ్చిన అలెక్స్‌ క్యారీ (70 బంతుల్లో 46; 4 ఫోర్లు)తో కలిసి ముందుగా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత జాగ్రత్త పడుతూ... ఓపిగ్గా ఆడుతూ పరుగుల బాటపట్టాడు. ఇద్దరి జోడీ కుదురుకోవడంతో నెమ్మదిగానైనా జట్టు కోలుకుంది. 72 బంతుల్లో స్మిత్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

నాలుగో వికెట్‌కు 103 పరుగులు జతయ్యాక జట్టు స్కోరు 117 పరుగుల వద్ద క్యారీని,  స్టొయినిస్‌ (0)ను రషీదే ఔట్‌ చేశాడు.  మళ్లీ కుదుపునకు గురైన స్మిత్‌ తన అసాధారణ పోరాటంతో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ముందుగా మ్యాక్స్‌వెల్‌ (23 బంతుల్లో 22;  2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి జట్టు స్కోరును 150 పరుగులు దాటించిన స్మిత్‌... టెయిలెండర్లతో కలిసి 200 పరుగుల దాకా తీసుకెళ్లాడు. కమిన్స్‌ (6) విఫలమైనా స్టార్క్‌ (36 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడటంతో జట్టు ఆ మాత్రమైనా చేయగలిగింది.  

 రాయ్‌ జోరు
ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 224. ఇదేమంత స్కోరే కాదు. కానీ కివీస్‌ చేతిలో జోరుమీదున్న భారత్‌ చిత్తవడం, ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా వికెట్ల విలాపంతో ఇంగ్లండ్‌ జాగ్రత్తపడింది. రాయ్, బెయిర్‌ స్టో (43 బంతుల్లో 34; 5 ఫోర్లు) మొదట్లో ఆచితూచి ఆడారు. పిచ్‌ను ఆకళింపు చేసుకున్నాక రాయ్‌ రఫ్ఫాడించడం మొదలుపెట్టాడు. స్టార్క్‌ వేసిన నాలుగో ఓవర్లో 2 బౌండరీలు కొట్టాడు. అతని మరుసటి ఓవర్లో భారీ సిక్సర్‌తో ఊపుతెచ్చాడు. పవర్‌ప్లే తర్వాత రాయ్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ పెంచాడు. 11వ ఓవర్లో స్పిన్నర్‌ లయన్‌ను రంగంలో దించగా... రాయ్‌ సిక్సర్‌తో అతనికి స్వాగతం పలికాడు. మరో బౌండరీ కూడా కొట్టడంతో అతని ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. స్టార్క్‌ వేసిన 15 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రాయ్‌ 50 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

వికెట్‌ కోసం స్మిత్‌ బౌలింగ్‌తో ఆసీస్‌ ప్రయోగం చేసింది. అతను 16వ ఓవర్‌ వేయగా... రాయ్‌ ‘హ్యాట్రిక్‌’ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో 21 పరుగులు రాగా జట్టు స్కోరు 100 పరుగులు దాటేసింది. ఓపెనింగ్‌ జోడీ దుర్భేద్యంగా మారడంతో స్టార్క్‌ బౌలింగ్‌ను అదేపనిగా కొనసాగించాడు. ఈ ప్రయత్నంలో ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ సఫలమయ్యాడు. 18వ ఓవర్లో బెయిర్‌స్టోను స్టార్క్‌ ఔట్‌ చేయడంతో 124 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే కమిన్స్‌ బౌలింగ్‌లో అంపైర్‌ తప్పుడు నిర్ణయంతో రాయ్‌ ఔటయ్యాడు. అతని నిష్క్రమణతో కెప్టెన్‌ మోర్గాన్‌... రూట్‌కు జతయ్యాడు. జట్టు విజయానికి కేవలం 77 పరుగులే కావాలి. ఎలాంటి ఒత్తిడి లేని ఈ దశలో వీళ్లిద్దరు మరో వికెట్‌ పడకుండా... చక్కగా తమ పని పూర్తిచేశారు.

ఇది  ఔటా!
అ‘ధర్మసేన’ నిర్ణయంపై జేసన్‌ రాయ్‌ భగ్గుమన్నాడు. 20వ ఓవర్‌ నాలుగో బంతిని కమిన్స్‌ లెగ్‌సైడ్‌లో వేశాడు. పుల్‌షాట్‌కు ప్రయత్నించినా... బంతి బ్యాట్‌కు చిక్కకుండానే కీపర్‌ చేతుల్లో పడింది. కానీ కంగారూ ఆటగాళ్లంతా పెద్దగా అప్పీల్‌ చేసేసరికి ధర్మసేన (శ్రీలంక) తీరిగ్గా ఔటిచ్చాడు. బ్యాట్‌కు తగలనంత దూరం వెళ్లినా... ఔటేంటని రాయ్‌ తీవ్రంగా వాదించాడు. పిచ్‌పై నుంచి కదల్లేదు. మరో అంపైర్‌ ఎరాస్మస్‌ (దక్షిణాఫ్రికా) సర్దిచెప్పడంతో ఆగ్రహంగా పెవిలియన్‌కు వెళ్లిన రాయ్‌ తన గ్లవ్స్‌ను విసిరికొట్టడం కనిపించింది. రాయ్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు 2 డీ మెరిట్‌ పాయింట్లు శిక్షగా విధించింది. అయితే ఎలాంటి నిషేధానికి గురికాకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద ఊరట.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్‌ 9; ఫించ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) ఆర్చర్‌ 0; స్మిత్‌ రనౌట్‌ 85; హ్యాండ్స్‌కోంబ్‌ (బి) వోక్స్‌ 4; క్యారీ (సి) సబ్‌–విన్స్‌ (బి) రషీద్‌ 46; స్టొయినిస్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) మోర్గాన్‌ (బి) ఆర్చర్‌ 22; కమిన్స్‌ (సి) రూట్‌ (బి) రషీద్‌ 6; స్టార్క్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 29; బెహ్రెన్‌డార్ఫ్‌ (బి) వుడ్‌ 1; లయన్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్‌) 223. 

వికెట్ల పతనం: 1–4, 2–10, 3–14, 4–117, 5–118, 6–157, 7–166, 8–217, 9–217, 10–223. 

బౌలింగ్‌: వోక్స్‌ 8–0–20–3, ఆర్చర్‌ 10–0–32–2, స్టోక్స్‌ 4–0–22–0, వుడ్‌ 9–0–45–1, ప్లంకెట్‌ 8–0–44–0, రషీద్‌ 10–0–54–3.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 85; బెయిర్‌ స్టో ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్‌ 34; జో రూట్‌ నాటౌట్‌ 49; మోర్గాన్‌ నాటౌట్‌ 45; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 226.
వికెట్ల పతనం: 1–124, 2–147.

బౌలింగ్‌: బెహ్రెన్‌డార్ఫ్‌ 8.1–2–38–0, స్టార్క్‌ 9–0–70–1, కమిన్స్‌ 7–0–34–1, లయన్‌ 5–0–49–0, స్మిత్‌ 1–0–21–0, స్టొయినిస్‌ 2–0–13–0.  
ఆర్చర్‌ బౌన్సర్‌ ధాటికి విలవిల్లాడిన క్యారీ... బ్యాండేజ్‌తో బ్యాటింగ్‌ కొనసాగించి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.


మరిన్ని వార్తలు