సిరీస్‌ అప్పగించారు

8 Mar, 2019 00:46 IST|Sakshi

గువాహటి: భారత మహిళలు మళ్లీ పొట్టి ఫార్మాట్‌లో చేతులెత్తేశారు. వరుసగా రెండో టి20లోనూ ఓటమి పాలై, మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను ఇంగ్లండ్‌ చేతుల్లో పెట్టేశారు. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. మిథాలీరాజ్‌ చేసిన 20 పరుగులే టాప్‌స్కోర్‌! ఇంగ్లండ్‌ బౌలర్లు బ్రంట్‌ 3, స్మిత్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ వ్యాట్‌ (64 నాటౌట్‌; 6 ఫోర్లు) కడదాకా నిలబడి జట్టును గెలిపించింది. ఏక్తా బిష్త్‌కు 2 వికెట్లు దక్కాయి. 

ఒక్కరైనా 20 దాటలేదు... 
టాస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించిన హర్లీన్‌ (14), కెప్టెన్‌ స్మృతి మంధాన (5 బంతుల్లో 12; 2 సిక్సర్లు) శుభారంభం అందించలేకపోయారు. పేసర్‌ క్యాథరిన్‌ బ్రంట్‌ ఓపెనర్‌ స్మృతిని, తర్వాత వచ్చిన జెమీమా (2)ను పెవిలియన్‌ చేర్చింది. ఇక్కడి నుంచి మొదలైన పతనం ఎక్కడా ఆగలేదు. మిథాలీ రాజ్‌ (20), దీప్తిశర్మ (18), భారతి ఫుల్మాలి (18) ఇలా అందరిదీ అదే దారి. పరుగుల్లో వేగం లేదు. చెప్పుకోదగ్గ వ్యక్తిగత స్కోరూ లేదు. 50 పరుగులకు ముందే 3 వికెట్లు... వంద లోపే 7 వికెట్లు..! ఎవరూ 20 పరుగులకు మించి చేయలేకపోయారు.

గెలిపించిన వ్యాట్‌...
చేసింది తక్కువ స్కోరైనా... దీన్ని నిలబెట్టుకునే పనిలో ఆతిథ్య బౌలర్లు చక్కగా శ్రమించారు. కెప్టెన్‌ హీథెర్‌నైట్‌ (2) సహా బీమోంట్‌ (8), జోన్స్‌ (5), సీవర్‌ (1)లను ఔట్‌ చేశారు. దీంతో 56 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్‌ డానియెల్‌ వ్యాట్‌ పోరాటంతో జట్టును గెలిపించింది. విన్‌ఫీల్డ్‌ (29; 4 ఫోర్లు) తో కలిసి ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించడంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. దీప్తి శర్మ, రాధాయాదవ్, పూనమ్‌ యాదవ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కిది వరుసగా ఆరో పరాజయం. ఆఖరి టి20 శనివారం ఇక్కడే జరుగుతుంది.

 

మరిన్ని వార్తలు