ఆడుతూ... పాడుతూ

15 Jun, 2019 04:48 IST|Sakshi
రూట్‌ సెంచరీ అభివాదం, వుడ్‌

వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ ఘనవిజయం

జో రూట్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ

మెరిసిన ఆర్చర్, వుడ్‌

బ్యాటింగ్‌ వైఫల్యంతో తేలిపోయిన కరీబియన్లు  

హార్డ్‌ హిట్టర్లు... మెరుపు పేసర్లతో నిండిన ఇంగ్లండ్‌ జట్టులో హంగు ఆర్భాటాలు లేకుండా, తన పని తాను చేసుకుంటూ పోతూ, సాత్వికంగా కనిపించే ఆటగాడు జో రూట్‌. ఓ దశలో ఆ జట్టు దూకుడైన ఆటతో రూట్‌ అవసరం ఇక లేదనిపించింది. కానీ, అతడో వెలకట్టలేని ఆభరణం. అందుకే... ఎందరు విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ పోటీకి వచ్చినా రూట్‌ను మాత్రం ఇంగ్లండ్‌ పక్కన పెట్టలేదు. ఈ నమ్మకానికి తగ్గట్లే... వన్డేలకు సరిగ్గా సరిపోయే సొగసైన ఆటతో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తన విలువను మరోసారి చాటాడతడు. పార్ట్‌టైమ్‌ స్పిన్‌తో ప్రత్యర్థిని కీలక సమయంలో కోలుకోలేని దెబ్బకొట్టి... జట్టు అవసరాల రీత్యా ఓపెనింగ్‌కు దిగి అజేయ సెంచరీతో గెలిపించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.  

సౌతాంప్టన్‌: జో రూట్‌ (94 బంతుల్లో 100 నాటౌట్‌; 11 ఫోర్లు; 2/27; 2 క్యాచ్‌లు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన మినహా... భారీ స్కోర్లు, మెరుపు ఇన్నింగ్స్‌ ఏమీ లేకుండా ఇంగ్లండ్‌– వెస్టిండీస్‌ మ్యాచ్‌ సాదాసీదాగా సాగిపోయింది. రెండు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 8 వికెట్లతో సునాయాస విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్‌ జట్టు బ్యాట్స్‌మెన్‌ పేలవ షాట్లతో వికెట్లు పారేసుకోవడంతో 44.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. నికోలస్‌ పూరన్‌ (78 బంతుల్లో 63; 3 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌.

ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ (41 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్‌), హెట్‌మైర్‌ (48 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆతిథ్య జట్టు పేసర్లు మార్క్‌ వుడ్‌ (3/18), జోఫ్రా ఆర్చర్‌ (3/30) కట్టుదిట్టంగా బంతులేయగా, రూట్‌ కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు. అనంతరం అతడు బెయిర్‌స్టో (46 బంతుల్లో 45; 7 ఫోర్లు)తో కలిసి ఛేదనలో శుభారంభం అందించాడు. దీంతో జట్టు ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా 33.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

సమష్టి వైఫల్యంతో...
మ్యాచ్‌లో వెస్టిండీస్‌ పరాజయానికి ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ప్రతిభ కంటే బ్యాట్స్‌మెన్‌ చెత్త షాట్లే కారణం. కాస్త నిలదొక్కుకుంటే పరుగులు చేసే వీలున్నా... అడ్డదిడ్డంగా బాది వారు ఔటయ్యారు. అధ్వాన ఫామ్‌ కొనసాగిస్తూ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (2) మూడో ఓవర్లోనే బౌల్డయ్యాడు. గేల్‌ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... షై హోప్‌ (11) పూర్తిగా తడబడ్డాడు. వీరిద్దరూ రెండు బంతుల వ్యవధిలో వెనుదిరగడంతో జట్టు బాధ్యతంతా హెట్‌మైర్, పూరన్‌పై పడింది.

ఈ కుర్రాళ్లు సమన్వయంతో బ్యాటింగ్‌ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. రన్‌రేట్‌ను పెంచుకుంటూ పోతూ వీరు నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దుతుండగా రూట్‌ దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో హెట్‌మైర్, కెప్టెన్‌ హోల్డర్‌ (9)లను రిటర్న్‌ క్యాచ్‌లతో పెవిలియన్‌ చేర్చాడు. రసెల్‌ (16 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుకు వుడ్‌ తెరదించాడు. ఆర్చర్‌ పదునైన పేస్‌తో పూరన్‌ను ఔట్‌ చేశాక విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు.

ఆతిథ్య జట్టు అలవోకగా...
అడపాదడపా షార్ట్‌ పిచ్‌ బంతులు వేయడం మినహా విండీస్‌ పేసర్లు ప్రభావవంతంగా లేకపోవడంతో ఛేదన ఇంగ్లండ్‌కు నల్లేరుపై నడకే అయింది. బౌండరీలు బాదుతూ బెయిర్‌స్టో, రూట్‌ ఓవర్‌కు 6 పైగా పరుగులు చేస్తూ పోయారు. తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించాక బెయిర్‌ స్టో ఔటయ్యాడు. రూట్‌తో రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించిన క్రిస్‌ వోక్స్‌ (54 బంతుల్లో 40; 4 ఫోర్లు) లక్ష్యానికి చేరువలో  వెనుదిరిగాడు. ఈ క్రమంలో రూట్‌ 50 బంతుల్లో అర్ధ సెంచరీ, 93 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో అతడికి 16వ వన్డే సెంచరీ కాగా, ఈ ప్రపంచ కప్‌లో రెండోది. స్టోక్స్‌ (6 బంతుల్లో 10 నాటౌట్‌; 2 ఫోర్లు) విజయ లాంఛనం పూర్తి చేశాడు.

స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) బెయిర్‌స్టో (బి) ప్లంకెట్‌ 36; లూయిస్‌ (బి) వోక్స్‌ 2; హోప్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) వుడ్‌ 11; పూరన్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 63; హెట్‌మైర్‌ (సి అండ్‌ బి) రూట్‌ 39; హోల్డర్‌ (సి అండ్‌ బి) రూట్‌ 9; రసెల్‌ (సి) వోక్స్‌ (బి) వుడ్‌ 21; బ్రాత్‌వైట్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 14; కాట్రెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్‌ 0; థామస్‌ (నాటౌట్‌) 0; గాబ్రియెల్‌ (బి) వుడ్‌ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (44.4 ఓవర్లలో ఆలౌట్‌) 212.

వికెట్ల పతనం: 1–4, 2–54, 3–55, 4–144, 5–156, 6–188, 7–202, 8–202, 9–211, 10–212.

బౌలింగ్‌: వోక్స్‌ 5–2–16–1; ఆర్చర్‌ 9–1–30–3; ప్లంకెట్‌ 5–0–30–1; వుడ్‌ 6.4–0–18–3; స్టోక్స్‌ 4–0–25–0; రషీద్‌ 10–0–61–0; రూట్‌ 5–0–27–2.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి) బ్రాత్‌వైట్‌ (బి) గాబ్రియెల్‌ 45; జో రూట్‌ (నాటౌట్‌) 100; వోక్స్‌ (సి) సబ్‌ (అలెన్‌) (బి) గాబ్రియెల్‌ 40; స్టోక్స్‌ (నాటౌట్‌) 10, ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (33.1 ఓవర్లలో 2 వికెట్లకు) 213.

వికెట్ల పతనం: 1–95, 2–199.

బౌలింగ్‌: కాట్రెల్‌ 3–0–17–0, థామస్‌ 6–0–43–0, గాబ్రియెల్‌ 7–0–49–2, రసెల్‌ 2–0–14–0, హోల్డర్‌ 5.1–0–31–0, బ్రాత్‌వైట్‌ 5–0–35–0, గేల్‌ 5–0–22–0.  

ఇంగ్లండ్‌కు గాయాల బెడద
హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌కు ప్రపంచ కప్‌లో గాయాల బెడద తీవ్రమవుతోంది. కీలక బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కండరాల గాయం నుంచి కోలుకున్నాడని ఊరట చెందుతుండగానే, స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్, కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌లు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. విండీస్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడిన రాయ్‌ తిరిగి రాలేదు.

నిబంధనల ప్రకారం అతడు మైదానం బయట ఎంత సమయమైతే ఉన్నాడో అంత సమయం, లేదంటే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడిన తర్వాత బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. దీంతో రాయ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే వీల్లేకపోయింది. ఇక మోర్గాన్‌... విండీస్‌ ఇన్నింగ్స్‌ 40వ ఓవర్లో వెన్నునొప్పితో తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో బెయిర్‌స్టోతో కలిసి రూట్‌ ఓపెనింగ్‌కు దిగగా, వోక్స్‌ను వన్‌డౌన్‌లో పంపాల్సి వచ్చింది. మరోవైపు పేసర్‌ మార్క్‌ వుడ్‌ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు శుక్రవారం ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఎదుర్కొని మరీ మ్యాచ్‌ ఆడటం గమనార్హం.


ఆర్చర్‌
 

మరిన్ని వార్తలు