ఆసీస్ కు 'స్ట్రోక్' ఇచ్చిన జాన్సన్

23 Oct, 2017 17:33 IST|Sakshi

మెల్ బోర్న్:త్వరలో ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు సంబంధించి ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండా కూడా ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్ ను గెలిచే సత్తా ఉందంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. బెన్ స్టోక్స్ లేకుండా యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ జట్టు గెలవలేదని ఇయాన్ చాపెల్, స్టీవ్ వా లాంటి ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తుంటే మరొకవైపు ఆ దేశానికే చెందిన మిచెల్ జాన్సన్ మాత్రం వారితో విభేదించడం ఇక్కడ గమనార్హం.

'స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ లేదు అనే వ్యాఖ్యలు అర్థరహితం. అటువంటి మితిమీరిన అంచనాలు కూడా తప్పు. స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ యాషెస్ ను గెలవగలదు. ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్ లేడు మనకే అవకాశాలు ఎక్కువ అనే ఆలోచన కట్టిపెట్టండి.  నేను ఇంకా యాషెస్ ను ఆసీస్ గెలుస్తుందనే నమ్మకంతోనే ఉన్నా. కానీ మా జట్టు ప్రదర్శన ఇటీవల కాలంలో చెప్పుకోదగిన విధంగా లేదు. అలా అని ఇంగ్లండ్ కూడా అద్భుతమైన విజయాల్ని ఏమీ సాధించలేదు. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం.ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టు మొత్తం ప్రదర్శనపై మా ఆటగాళ్లు దృష్టి పెడితే మంచిది. స్టోక్స్ విషయాన్ని పక్కకుపెట్టి సిరీస్ గెలవడం గురించి ఆలోచించండి'అని జాన్సన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు