ఇంగ్లండ్‌ ఇక కష్టమే..!

8 Sep, 2019 05:30 IST|Sakshi
స్టీవ్‌ స్మిత్‌

విజయ లక్ష్యం 383; ప్రస్తుతం 18/2

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 186/6 డిక్లేర్డ్‌

రాణించిన స్మిత్‌

మాంచెస్టర్‌: కళ్లెదుట 383 పరుగుల భారీ లక్ష్యం... నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌... భీకరంగా బంతులేస్తున్న ప్రత్యర్థి పేసర్లు... ప్రస్తుతం స్కోరు 18/2..! కమిన్స్‌ (2/8) నిప్పులు చెరగడంతో ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ బర్న్స్‌ (0)తో పాటు కీలకమైన కెప్టెన్‌ జో రూట్‌ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. చేతిలో ఉన్న 8 వికెట్లతో ఇంకా 365 పరుగులు చేయాల్సి ఉంది. ఇదీ యాషెస్‌ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ పరిస్థితి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 186/6 వద్ద డిక్లేర్‌ చేసింది. మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (92 బంతుల్లో 82; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వేడ్‌ (76 బంతుల్లో 34; 2 ఫోర్లు) సహకరించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కమిన్స్‌ బెంబేలెత్తించాడు.

ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ మూడు, నాలుగు బంతులకు బర్న్స్, రూట్‌లను బలిగొన్నాడు. అత్యద్భుతం అనదగ్గ బంతితో రూట్‌ వికెట్లను అతడు గిరాటేసిన వైనం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 200/5తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 301 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్‌ (3/80) ధాటికి స్టోక్స్‌ (26), బెయిర్‌ స్టో (17) త్వరగానే ఔటయ్యారు. బట్లర్‌ (65 బంతుల్లో 41; 7 ఫోర్లు) పోరాటంతో ఫాలో ఆన్‌ తప్పించాడు. 196 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా 44 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ స్థితిలో స్మిత్‌ మళ్లీ అడ్డుగోడలా నిలిచాడు. సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరును పెంచుకుంటూ పోయాడు. వేడ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా