ఇంగ్లండ్‌ ‘సూపర్‌’ దెబ్బకు కివీస్‌ మటాష్‌

10 Nov, 2019 11:22 IST|Sakshi

ఆక్లాండ్‌: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్‌ ఓవర్‌. ఆ మెగా పోరులో స్కోరు సమం కావడం ఆపై సూపర్‌ ఓవర్‌లో ఇరు జట్లు సమంగా పరుగులు చేయడంతో వరల్డ్‌కప్‌ విజేతను బౌండరీల ఆధారంగా ప్రకటించారు.  ఇక్కడ ఇంగ్లండ్‌ అత్యధికంగా ఎక్కువ ఫోర్లు సాధించడంతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అప్పుడు అంతా కివీస్‌ది దురదృష్టం అనుకున్నారంతా. అయితే ఆ వరల్డ్‌కప్‌ తర్వాత ఇరు జట్ల మధ్య జరగిన  తొలి ద్వైపాక్షిక సిరీస్‌లో చివరి మ్యాచ్‌(సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌) టై అయ్యింది. దాంతో సూపర్‌ ఓవర్‌ తప్పలేదు.

అయితే ఈ సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచి సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా17 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ వికెట్‌ వికెట్‌ నష్టానికి 8 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఇక్కడ ఇంగ్లండ్‌ తిరుగులేని ఆధిక్యం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. కివీస్‌  తరఫున సూపర్‌ ఓవర్‌ను సౌతీ వేయగా, ఇంగ్లండ్‌ తరఫున జోర్డాన్‌ వేశాడు.

అంతకుముందు చివరి టీ20కి వరుణుడు పలుమార్లు ఆటంకం కల్గించడంతో మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దాంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల నష్దానికి 146 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌(50; 20 బంతుల్లో 3 పోర్లు, 5 సిక్సర్లు), మున్రో(46; 21 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. చివర్లో టిమ్‌ సీఫెర్ట్‌( 39; 16 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో న్యూజిలాండ్‌ 147 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ సైతం 11 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసింది. బెయిర్‌ స్టో(47; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్‌ కరాన్‌(24; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) , మోర్గాన్‌(17; 7 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు)టామ్‌ కరాన్‌( 12; 9 బంతుల్లో 1 సిక్స్‌), క్రిస్‌ జోర్డాన్‌(12 నాటౌట్‌; 3 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), శామ్‌ బిల్లింగ్స్‌(11 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌)లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దాంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యం కావడం.. అందులో ఇంగ్లండ్‌ విజేతగా నిలవడంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.  ఈ ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవగా, రెండు, మూడు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. నాల్గో టీ20లో ఇంగ్లండ్‌ గెలిచింది.

మరిన్ని వార్తలు