ఇంగ్లండ్‌ 258 ఆలౌట్‌

16 Aug, 2019 05:34 IST|Sakshi
ఆసీస్‌ ఆటగాళ్ల సంబరాలు

లండన్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఇంగ్లండ్‌  తొలిరోజే తేలిపోయింది.      ఆస్ట్రేలియా పేసర్లు హాజెల్‌వుడ్‌ (3/58), కమిన్స్‌ (3/61)తో పాటు స్పిన్నర్‌ లయన్‌ (3/68) చెలరేగడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77.1 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు ఆట వర్షంతో రద్దవడంతో పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా టాస్‌ నెగ్గిన ఆసీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.  ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (0)ని హాజెల్‌వుడ్‌  డకౌట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ పరుగుల ఖాతా తెరవకముందే వికెట్‌ కోల్పోయింది. కాసేపటికి కెప్టెన్‌ రూట్‌ (14)నూ అతనే ఔట్‌ చేశాడు. 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా... ఓపెనర్‌ బర్న్స్‌ (53; 7 ఫోర్లు), డెన్లీ (30; 4 ఫోర్లు) నింపాదిగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. లంచ్‌ విరామం తర్వాత ఇంగ్లండ్‌ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.

డెన్లీని హాజెల్‌వుడ్‌ ఔట్‌ చేయగా, అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న బర్న్స్‌ను కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. సిడిల్‌ బౌలింగ్‌లో బట్లర్‌ (12), లయన్‌ స్పిన్‌కు స్టోక్స్‌ (13) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. దీంతో ఇంగ్లండ్‌ 138 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. బెయిర్‌ స్టో (52; 7 ఫోర్లు), వోక్స్‌ (32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆసీస్‌ బౌలర్లను ఎదురు నిలవడంతో స్కోరు 200 దాటింది. ఈ దశలో కమిన్స్‌ చెలరేగడంతో వోక్స్, ఆర్చర్‌ (12) నిష్క్రమించారు. అర్ధసెంచరీ అనంతరం బెయిర్‌స్టో ఆఖరి వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.   అనంతరం ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 30 పరుగులు చేసింది. వార్నర్‌ (3)ను బ్రాడ్‌ బౌల్డ్‌ చేశాడు. క్రీజ్‌లో బాన్‌క్రాఫ్ట్‌ (5), ఖాజా (18) ఉన్నారు.

మరిన్ని వార్తలు