సౌత్‌గేట్‌ రైల్వే స్టేషన్‌

17 Jul, 2018 00:51 IST|Sakshi

ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌కు అరుదైన గౌరవం  

లండన్‌: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జట్టు 1990 తర్వాత మరోసారి సెమీస్‌ చేరి అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దాంతో ఈ టోర్నీలో జట్టు కోచ్‌ గారెత్‌ సౌత్‌గేట్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. యువ ఆటగాళ్లతో నిండిన జట్టును అతను నడిపించిన తీరు, సానుకూల దృక్పథం,  సౌత్‌గేట్‌కు కొత్త అభిమానులను తెచ్చి పెట్టాయి. ఇప్పుడు లండన్‌లోని ఒక రైల్వే స్టేషన్‌ కూడా అతనిపై అదే తరహా అభిమానాన్ని ప్రదర్శించింది. ఉత్తర లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌లో ఉన్న అండర్‌ గ్రౌండ్‌ రైల్వే స్టేషన్‌కు తాత్కాలికంగా (48 గంటల పాటు) గారెత్‌ సౌత్‌గేట్‌ స్టేషన్‌ అని పేరు పెట్టింది. దానికి అనుగుణంగా ప్లాట్‌ఫారమ్‌లు, టికెట్‌ కౌంటర్లు, స్టేషన్‌ బయట హోర్డింగ్‌లు అన్నింటిని మార్చేసింది.  

పారిస్‌లో కూడా...: ఇక వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌ జట్టులో ఆటగాళ్లను పారిస్‌ ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్‌ఏటీపీ) కూడా ఇదే తరహాలో గౌరవించుకుంది. ఆరు రైల్వే స్టేషన్లకు పేర్లు మార్చింది. అయితే ఎన్ని రోజులో ఆర్‌ఏటీపీ స్పష్టం చేయలేదు. కెప్టెన్‌ హ్యూగో లోరిస్, కోచ్‌ డెచాంప్స్‌ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు