లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

15 Jul, 2019 04:36 IST|Sakshi

అద్వితీయం ఇంగ్లండ్‌ ప్రస్థానం

నాలుగో ప్రయత్నంలో ప్రపంచకప్‌ సొంతం

సమష్టి ప్రదర్శనతో చిరస్మరణీయ ఫలితం

సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్‌ అద్భుతమైన వన్డే క్రికెట్‌ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్‌ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్‌ జట్టు టాప్‌–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్‌ కప్‌ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్‌ మోర్గాన్, కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు.

ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్‌కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్, బెల్‌లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్‌రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్‌ ఆటగాడు కూడా బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్‌ వన్డేల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్‌ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్‌ సేన తమ దేశంలో సంబరాలు పంచింది.  

ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్‌ వన్డే ప్రపంచ కప్‌ గెలవలేదని. పేరుకే క్రికెట్‌ ఇంగ్లండ్‌లో పుట్టినా, వన్డే వరల్డ్‌ కప్‌ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్‌ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్‌లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్‌కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్‌ టీమ్‌ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్‌ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది.

పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్‌ బౌలర్‌ వసీమ్‌ అక్రమ్‌ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్‌ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్‌కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్‌ కంటే కూడా ఇంగ్లండ్‌కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్‌ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది.   దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్‌ అభిమానులు ‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్‌ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. 

తొలి మ్యాచ్‌లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్‌ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా,  శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్‌ను గుర్తుకు తెచ్చింది. నిజంగా  ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్‌పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్‌నూ ఓడించి దర్జాగా సెమీస్‌ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్‌లో తమ చేతిలో చిత్తయిన కివీస్‌పై ఫైనల్‌ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్‌నే ఓడించిన న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌కు తెలుసు. రసవత్తర ఫైనల్‌ దానిని నిజం చేసింది. చివరకు అశేష  అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది.  

ఇంగ్లండ్‌ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్‌స్టో (532 పరుగులు), జేసన్‌ రాయ్‌ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్‌ (556 పరుగులు), స్టోక్స్‌ (465 పరుగులు), బట్లర్‌ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్‌ (371 పరుగులు) బ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్‌ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్‌ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్‌లో ఆర్చర్‌ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్‌ (18 వికెట్లు), వోక్స్‌ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్‌ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్‌ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్‌ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్‌ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి.    

1975, జూన్‌ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరిగిన ప్రపంచ కప్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. క్రికెట్‌ను కనుగొన్న దేశం వరల్డ్‌ కప్‌ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది.

2019, జూలై 14: లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది.

మరిన్ని వార్తలు