'వారి ఫేవరెట్ ట్యాగ్ను పట్టించుకోం'

29 Mar, 2016 17:52 IST|Sakshi
'వారి ఫేవరెట్ ట్యాగ్ను పట్టించుకోం'

ఢిల్లీ:  వరల్డ్ ట్వంటీ20లో ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన సంతృప్తికరంగానే సాగుతుందని ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పష్టం చేశాడు. తమ జట్టు నాకౌట్ కు చేరే క్రమంలో అనేక గుణపాఠాలు నేర్చుకుని పటిష్టంగా తయారైందన్నాడు.  తాము వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి జట్లపై భారీ స్కోర్లు నమోదు చేస్తే, అప్ఘానిస్తాన్ పై నమోదు చేసిన స్వల్ప స్కోరును తమ స్పిన్నర్లు కాపాడిన తీరు నిజంగా అభినందనీయమన్నాడు. శ్రీలంకతో  కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పేసర్లు విశేషంగా రాణించారన్నాడు. ప్రత్యేకంగా చివరి ఓవర్లలో శ్రీలంకను కట్టడి చేసి విజయం సాధించిన తీరును మోర్గాన్ గుర్తు చేశాడు.

' న్యూజిలాండ్ తో జరిగే సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నకివీస్ తో రేపు రసవత్తరపోరు తప్పదు. ఆ పోరులో విజయం సాధించి ఫైనల్ కు చేరాలని ఆతృతగా ఉన్నాం. మాపై న్యూజిలాండ్ ను ఫేవరెట్ గా పరిగణిస్తున్నా, ఆ ట్యాగ్ ను పట్టించుకోం. 2010 లో వరల్డ్ కప్ గెలిచిన  మా జట్టు అదే పునరావృతం చేయాలని భావిస్తోంది' అని మోర్గాన్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు